AP: నేడే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ భేటీ
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో పలు అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ఈ నెలలోనే ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ భేటీలో పలు అంశాలపై ఏపీ మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోనుంది. శాసనసభ సమావేశాల నిర్వహణపై చర్చించనున్నారు. పూర్తి స్థాయి బడ్జెట్‌పైనా కేబినెట్ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 11 నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ గురించి కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. అలాగే ఓ భారీ ప్రాజెక్టుకు ఆమోదం కూడా తెలిపే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది.ఉక్కు సంస్థ.. ఆర్సెలార్ మిట్టల్, జపాన్‌కు చెందిన నిప్పాన్ స్టీల్స్ జాయింట్ వెంచర్ అయిన ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్స్ ఇండియా సంస్థ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. అనకాపల్లి జిల్లాలో ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్స్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇవాళ జరిగే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో దీనికి ఆమోదం లభించే అవకాశాలు ఉన్నాయి. దీనికి అవసరమైన ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. మరోవైపు ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌తో పాటుగా కో-టెర్మినస్ క్యాప్టివ్ పోర్టు అభివృద్ధికి మిట్టల్ సంస్థ ప్రతిపాదనలు పంపింది.
పోలవరంపై చంద్రబాబు సమీక్ష
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రి నిమ్మల రామానాయుడు, అధికారులు, నిర్మాణ ఏజెన్సీ ప్రతినిధులు హాజరయ్యారు. సమస్యలు పరిష్కరించి పోలవరం పనులు ముందుకు తీసుకెళ్లే అంశంపై చర్చించారు. కొత్త డయాఫ్రం వాల్ డిజైన్లు, నిర్మాణ ప్రణాళిక, డిజైన్లకు అనుమతి, నిర్దేశిత లక్ష్యాల మేరకు పనులు పూర్తయ్యే అంశంపై సమీక్షలో చర్చించారు. నేటి నుంచి నాలుగు రోజుల పాటు పోలవరం ప్రాజెక్టు సాంకేతిక అంశాలపై నిపుణుల సాంకేతిక మేథోమథన సదస్సు జరగనుంది. పోలవరం ప్రాజెక్టు వద్ద జరిగే ఈ సమావేశంలో ప్రాజెక్టు నిర్మాణం, జియో టెక్నికల్ నిపుణుల విదేశీ బృందం, కేంద్ర జల్‌శక్తి శాఖ, సీడబ్ల్యూసీ, పీపీఏ అధికారులు, రాష్ట్ర జలవనరులశాఖ ఉన్నతాధికారులు, ఢిల్లీ, చెన్నై, తిరుపతి ఐఐటీ నిపుణులు పాల్గొననున్నారు. డయాఫ్రం వాల్, ఎర్త్ రాక్ ఫిల్ డ్యామ్, ప్రాజెక్టు నిర్మాణాలపై చర్చించనున్నారు. విదేశీ, స్వదేశీ సాంకేతిక నిపుణులు ప్రాజెక్టును క్షేత్రస్థాయి నుంచి పరిశీలించనున్నారు. కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం, డిజైన్లపై చర్చించనున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com