Ratan Tata: రతన్‌ టాటా మృతికి ఏపీ క్యాబినెట్‌ సంతాపం.

అజెండాపై చర్చ వాయిదా

ఏపీ సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ భేటీ ముగిసింది. అజెండా అంశాలపై చర్చను క్యాబినెట్‌ వాయిదా వేసింది. రతన్‌ టాటా మృతికి సంతాపం ప్రకటించింది. భేటీకి ముందు ఆయన చిత్రపటం వద్ద సీఎం చంద్రబాబు, మంత్రులు నివాళి అర్పించారు.

దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటా మృతికి సంతాపం ప్రకటించింది ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశం.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన.. ఏపీ సచివాలయంలో కేబినెట్‌ సమావేశం ప్రారంభమైన వెంటనే రతన్‌ టాటాకు నివాళులర్పించింది.. రతన్ టాటా దేశానికి చేసిన సేవలను ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. విలువలతో కూడిన వ్యాపారంతో రతన్ టాటా ఒక పెద్ద బ్రాండ్ ను సృష్టించారని ముఖ్యమంత్రి కొనియాడారు. సంపదను సృష్టించడమే కాకుండా.. ఆ సంపదను సమాజంలో అన్ని వర్గాలకు చేరేలా పద్మవిభూషన్ రతన్ టాటా ఎంతో కృషి చేశారని అన్నారు.


రతన్ టాటా మృతి పారిశ్రామిక రంగానికే కాకుండా దేశానికే తీరనిలోటని పేర్కొన్నారు.. ఇక, రతన్ టాటా మృతికి సంతాపంగా కేబినెట్‌ రెండు నిముషాల పాటు మౌనం పాటించి నివాళులు అర్పించింది. రతన్ టాటా చిత్ర పటానికి పూలు వేసి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు నివాళులు అర్పించారు. అనంతరం సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ముంబై బయల్దేరి వెళ్లారు.. రతన్‌ టాటా భౌతికకాయానికి నివాళులర్పించనున్నారు ఏపీ సీఎం.. మంత్రులు.. కాగా, ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత రతన్ టాటా అంతిమయాత్ర ప్రారంభం కానుండగా.. సాయంత్రం 6 గంటల సమయంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Tags

Next Story