AP CABINET: ప్రజా ప్రతినిధులూ..మీరే ఇలా చేస్తే ఎలా.?

ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా.. కొంతమంది ఎమ్మెల్యేల తీరు తీవ్ర దుమారం రేపుతోంది. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఆయన అనుచరులు.. అటవీ సిబ్బందిపై దాడి చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక ప్రిన్సిపల్‌ను వేధించారన్న ఆరోపణలు ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ , గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వ్యవహారం, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సహా పలువురు ఎమ్మెల్యేల తీరు ఇటీవల.. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీయడంతో.. ఇలాంటి ఘటనలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. అమరావతిలో నిర్వహించిన ఏపీ మంత్రివర్గ సమావేశం తర్వాత ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి మంత్రులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
సహించేదే లేదు: చంద్రబాబు
మంత్రులు, ఎమ్మెల్యేలకూ చంద్రబాబు గట్టి వార్నింగ్ ఇచ్చారు. నేతలు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదన్నారు..ఎమ్మెల్యేలు అడ్డగోలుగా వ్యవహరిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. జరుగుతున్న సంఘటనలకు సంబంధించి ప్రధానంగా సీఎం వివరించారు.. ఎమ్మెల్యేలు అనవసర విషయాల్లో జోక్యం చేసుకుంటే అనవసర ఇబ్బందులు తప్పవన్నారు. ఫైళ్ల క్లియరెన్స్‌కు సంబంధించి కూడా మంత్రులపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంతమంది మంత్రులు, అధికారులు ఫైల్స్ క్లియరెన్స్ కు ఎక్కువ సమయం తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రుల పెర్ఫామెన్స్ పై వచ్చే కేబినెట్లో చర్చిస్తామని వెల్లడించారు.
కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. మొత్తం 33 అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.. జలవనరులశాఖ పనులకు సంబంధించి మరో 11 అంశాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మంత్రివర్గం.. ఏపీ సర్క్యులర్ ఎకానమీ, వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ (4.0) 2025-30కి ఆమోదం తెలపగా.. పర్యాటక ప్రాజెక్టులకు ప్రభుత్వ భూముల కేటాయింపు మార్గదర్శకాలకు ఆమోదముద్ర వేసింది.. అధికారిక భాష కమిషన్ పేరు మార్పునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ‘మండలి వెంకట కృష్ణారావు అధికారిక భాష సంఘం….’గా మార్పునకు ఆమోదముద్ర పడింది. సాగుభూమిని వ్యవసాయేతరంగా మార్పునకు నాలా చట్ట సవరణలకు ఆమోదం తెలిపింది కేబినెట్.. 51వ సీఆర్డీఏ సమావేశం ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.. రాజధాని పరిధి 29 గ్రామాల్లో రూ.904 కోట్లతో మౌలిక వసతుల కల్పనకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. సీఆర్డీఏ పరిధిలో సంస్థలకు భూకేటాయింపునకు ఆమోదం లభించగా.. మంత్రి వర్గ ఉపసంఘం సిఫార్సులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com