AP Election: రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లడం నిషేధం-ఈసీ

AP Election: రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లడం నిషేధం-ఈసీ
ఏపీ ఎన్నికలపై ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కీలక సూచనలు

ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న సమయంలో.. పోటీలో ఉండే అభ్యర్థులు, వారి ఏజెంట్లు, రాజకీయ పార్టీల కార్యకర్తలు 50 వేలకు మించి నగదు, 10 వేల కన్నా ఎక్కువ విలువైన వస్తువులను రవాణా చేయటం నిషిద్ధమనిరాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా ప్రకటించారు. పార్టీల స్టార్‌ క్యాంపెయినర్లు లక్షకు మించి నగదు కలిగి ఉండకూడదని స్పష్టం చేశారు. పరిమితికి మించి నగదు రవాణా చేస్తున్న వాహనాలను కూడా ఆ నగదుతోపాటే సీజ్‌ చేస్తామన్నారు.

త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ.. ఎన్నికల సంఘం తాజా మార్గదర్శకాలు, సూచనలపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు గురువారం కార్యశాల నిర్వహించింది. కులం, మతం, భాష ప్రాతిపదికన ఓటర్లను ప్రేరేపించటం, ఓట్లు అడగటం నిషిద్ధమని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా తెలిపారు. ‘లోక్‌సభ అభ్యర్థులు 95 లక్షల వరకు, శాసనసభ అభ్యర్థులు 40 లక్షల వరకు ఖర్చు చేసేందుకు అనుమతి ఉందన్నారు. బహిరంగ సభల నిర్వహణ, పోస్టర్లు, బ్యానర్లు, వాహనాల కోసమే ఈ మొత్తాన్ని వెచ్చించాలని సూచించారు. ఓటర్లను ప్రభావితం చేసేలా నగదు, కానుకలు, మద్యం, ఇతర వస్తువులు పంపిణీ చేయటాన్ని చట్టవిరుద్ధమైన వ్యయంగా పరిగణిస్తామన్నారు. ఎన్నికల వ్యయం కోసం అభ్యర్థులు ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా, రోజువారీ ఖర్చుల రిజిస్టర్‌ నిర్వహించాలన్నారు. పార్టీలు, అభ్యర్థులు చేసే ఎన్నికల వ్యయంపై పూర్తిస్థాయిలో నిఘా ఉంటుందని తెలిపారు.

ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన వెంటనే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందన్న ముకేశ్‌కుమార్‌ మీనా లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థులు 25 వేలు, శాసనసభకు పోటీ చేసేవారు 10 వేలు.. నగదు రూపంలో లేదా ఆర్‌బీఐ/ ట్రెజరీ ద్వారా సెక్యూరిటీ డిపాజిట్‌ కింద చెల్లించాలన్నారు. చెక్కులు, బ్యాంక్‌ డ్రాఫ్టులు అనుమతించట్లేదన్నారు. ప్రభుత్వ పనిదినాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సంబంధిత ఆర్వోలు, ఏఆర్వోలు నామినేషన్లు స్వీకరిస్తారన్నారు. నామినేషన్లు వేసేందుకు వచ్చే అభ్యర్థులు 100 మీటర్ల దూరంలో వారి వాహనాలను నిలిపేయాలని సూచించారు. అభ్యర్థితో కలిపి మొత్తం అయిదుగుర్ని మాత్రమే లోపలికి అనుమతిస్తామన్నారు. షెడ్యూల్‌ ప్రకటించినప్పటి నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు ఎన్నికల ప్రవర్తన నియమావళికి లోబడి రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రవర్తించాలన్నారు. షెడ్యూల్‌ విడుదలైన అయిదారు రోజుల తర్వాత నోటిఫికేషన్‌ వస్తుందన్నారు. కోడ్‌ అమల్లో ఉండగా ఎలాంటి బహిరంగ కార్యక్రమాలు నిర్వహించాలన్నా ముందస్తు అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. పార్టీలు, ప్రతినిధులు నిర్వహించే కార్యక్రమాలను పూర్తిస్థాయిలో వీడియోగ్రఫీ ద్వారా పర్యవేక్షిస్తాం’ అని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు, వాటి ప్రతినిధులు ఎన్నికల ప్రక్రియపై సమగ్ర అవగాహన ఏర్పరరుచుకుని ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు సహకరించాలని ముకేశ్‌కుమార్‌ మీనా కోరారు.

Tags

Read MoreRead Less
Next Story