AP CID: చంద్రబాబుపై మరో కక్ష సాధింపు

AP CID: చంద్రబాబుపై మరో కక్ష సాధింపు
మద్యం కంపెనీలకు అనుచిత లబ్ధి చేకూర్చారని కేసు నమోదు.... దొంగే దొంగా అన్నట్లుగా ఉందన్న ప్రతిపక్షాలు

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై జగన్‌ ప్రభుత్వం కక్ష సాధింపులను మరింత తీవ్రతరం చేసింది. కక్ష సాధింపులో భాగంగా తాజాగా చంద్రబాబుపై మరో కేసు పెట్టింది. జగన్‌ ప్రభుత్వ మద్యం విధానంపై ప్రతిపక్షాలు నాలుగేళ్లుగా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాయి. నాసిరకం మద్యం బ్రాండ్లు అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం అడుతున్నారని , ఆన్‌లైన్‌ లావాదేవీలు లేకుండా చేసి భారీగా దోచుకుంటున్నారని విమర్శిస్తున్నాయి. సీఎం జగన్‌, ఆయన అనుచరులు ఏటా 25 వేల కోట్ల మేర దోచుకుంటున్నారని.., ఈ కుంభకోణంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని ఇటీవలే బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కోరారు. ఇలా జగన్‌ ప్రభుత్వ మద్యం వ్యాపారం లోగుట్టులన్నీ బయటపెడుతున్నారు. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే దొంగే దొంగా దొంగా అన్నట్లుగా జగన్‌ ప్రభుత్వం చంద్రబాబుపై కేసు బనాయించటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


గత ప్రభుత్వ హయాంలో పలు మద్యం కంపెనీలు, సరఫరాదారులకు అనుకూల నిర్ణయాలు తీసుకుని వారికి అనుచితలబ్ధి కలిగించారని ఆరోపిస్తూ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ డి.వాసుదేవరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చంద్రబాబుతో పాటు అప్పటి ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ ఐ.శ్రీనివాస శ్రీనరేష్‌, అప్పటి ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్రపై సీఐడీ తాజాగా కేసు నమోదు చేసింది. చంద్రబాబును మూడో నిందితుడుగానూ శ్రీనివాస శ్రీనరేష్‌ను ప్రధాన నిందితుడిగా, కొల్లు రవీంద్రను రెండో నిందితుడిగా పేర్కొంది. పబ్లిక్‌ సర్వెంట్‌ చట్టానికి లోబడి ఉండకపోవటం, పబ్లిక్‌ సర్వెంట్‌ తప్పుడు డాక్యుమెంట్‌ రూపొందించటం, నేరపూరిత కుట్ర, నేరపూరిత విశ్వాస ఘాతుకం వంటి అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వాసుదేవరెడ్డి ఈ నెల 11న ఫిర్యాదు ఇవ్వగా 28న సీఐడీలో కేసు నమోదైంది. ఆ FIRను సీఐడీ అధికారులు సోమవారం విజయవాడ ఏసీబీ కోర్టుకు సమర్పించారు.


ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేలా గత ప్రభుత్వం లైసెన్స్‌దారులకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకుందని FIRలో CID పేర్కొంది. 2019 మార్చి 8న సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత కొన్ని కొత్త బ్రాండ్లకు అనుమతినిచ్చారని, మద్యం సరఫరాదారులు, లైసెన్స్‌దారులతో కుమ్మక్కై కొన్ని రకాల ఉత్పత్తులకు కృత్రిమ డిమాండ్‌ సృష్టించారని CID ఆరోపించింది. కొన్ని కంపెనీలకు మార్కెట్‌ వాటాతో పొంతన లేకుండా ఆర్డర్లు ఇచ్చారని, 70 శాతం ఆర్డర్లు వాటికే వెళ్లాయని తెలిపింది. ఈ కుట్రను బయట పెట్టేందుకు లోతైన దర్యాప్తు అవసరమని FIRలో CID పేర్కొంది. 2015-17 సంవత్సరాలకు సంబంధించిన మద్యం విధానంలో లైసెన్స్‌దారులకు మేలు చేసేలా మద్యం దుకాణాలకు ప్రివిలేజ్‌ ఫీజు తొలగించారని., దానివల్ల ప్రభుత్వానికి కలిగే నష్టాన్ని పరిగణనలోకి తీసుకోలేదని CID తెలిపింది. 2వేల934 మద్యం దుకాణాలున్న ఏపీలో ఆ వ్యాపారం మొత్తాన్ని తమ గుప్పిట్లో పెట్టుకున్న వైసీపీ నాయకులు, వారి అస్మదీయులు...ప్రజలను దోచుకుంటుండడమే అసలు కుంభకోణమని, దాన్నుంచి దృష్టి మళ్లించటానికి గత ప్రభుత్వ హయాంలో ఏదో జరిగిపోయిందంటూ తప్పుడు కేసులు పెడుతున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

నైపుణ్యాభివృద్ధి కేసులో చంద్రబాబు అరెస్టు తర్వాత అమరావతి ఇన్నర్‌రింగ్‌ రోడ్డు, ఫైబర్‌ నెట్‌ కేసుల్లో సీఐడీ ఆయనపై పీటీ వారంట్లు దాఖలు చేసింది. అమరావతి ఎసైన్డ్‌ భూముల వ్యవహారానికి సంబంధించిన కేసు రీఓపెన్‌కు అనుమతి కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ వేసింది. తాజాగా మరో కేసును తెరపైకి తెచ్చింది. నైపుణ్యాభివృద్ధి కేసులో ప్రస్తుతం జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబును జైలు నుంచి బయటకు రానీయకూడదన్న కుట్రతోనే అక్రమ కేసుల పరంపరకు జగన్‌ ప్రభుత్వం తెరలేపిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story