AP: స్టూడియోల నిర్మాణానికి ముందుకు రండి

AP: స్టూడియోల నిర్మాణానికి ముందుకు రండి
X
నిర్మాతలకు ఆంధ్రప్రదేశ్‌ సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ ఆహ్వానం=

ఆంధ్రప్రదేశ్‌లో స్టూడియోలు నిర్మించేందుకు నిర్మాతలు తరలిరావాలని ఏపీ నూతన పర్యాటక శాఖ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ ఆహ్వానం పలికారు. సచివాలయంలో మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన దుర్గేష్‌... రూ.2.31 కోట్లతో 10 టూరిజం బోట్ల కొనుగోలుకి సంబంధించిన ఫైల్‌పై తొలి సంతకం చేశారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కందుల దుర్గేష్‌కు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, జనసేన ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, టీడీపీ నేతలు అభినందలు తెలిపారు. మంచి వనరులు ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను అధికార యంత్రాంగంతో కలిసి పర్యాటకంగా అభివృద్ధి చేస్తానని దుర్గేశ్‌ బాధ్యతల స్వీకరణ అనంతరం ప్రకటించారు. ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం, అడ్వెంచర్ టూరిజం వంటి వాటిని విస్తృతంగా ప్రోత్సహిస్తామన్నారు. పర్యాటక ప్రాంతాలుగా విరజిల్లాల్సిన ప్రాంతాలను వైసీపీ ప్రభుత్వం విస్మరించిందని... అదృష్టవశాత్తు ప్రజానీకం వైసీపీ‌కి సరైన రీతిలో బుద్ధి చెప్పారని తెలిపారు. ఇకపై పర్యాటక సాంస్కృతిక విధానాల్లో సరైన రీతిలో ముందుకు తీసుకువెళ్లి ప్రజలకు ఉపయోగపడే విధంగా చర్యలు ఉంటాయన్నారు. పర్యాటక రంగాన్ని ఉపయోగించుకొని నిధులు సమకూర్చుకునే విధంగా ప్రయత్నం చేస్తామన్నారు.

ఇటీవలే చిరంజీవిని కలిసి

ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌ మెగాస్టార్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి దుర్గేష్‌ నిన్న హైదరాబాద్ లో జరుగుతున్న విశ్వంభర షూటింగ్ సెట్స్ కి వెళ్లారు. ఇందులో భాగంగా కందుల దుర్గేష్‌ తో చిరంజీవి కాసేపు ముచ్చటించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఇదే విషయాన్ని చిరంజీవి స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. మిత్రుడు కందుల దుర్గష్.. ఏపీ పర్యాటక మరియు సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న సందర్భంగా విశ్వంభర సెట్స్‌ ఆయనకు స్వాగతం పలకడం ఆనందంగా ఉంది. మంత్రిగా ఆయన సంపూర్ణ విజయం సాధించాలని కోరుకుంటూ ఆయనకు నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి, ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటారని ఆయన చెప్పారు.. అంటూ రాసుకొచ్చారు చిరంజీవి. ప్రస్తుతం చిరంజీవి చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Tags

Next Story