AP: గ్రామ పంచాయతీల్లో క్లస్టర్ వ్యవస్థ రద్దు

గ్రామ పంచాయతీల పరిపాలనా వ్యవస్థలో నూతన సంస్కరణలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో గ్రామ పంచాయతీల్లో పారదర్శకతతో కూడిన పాలన అందించేందుకు ఈ నూతన విధానాలకు రూపకల్పన చేశారు. మాజీ రాష్ట్రపతి డా.అబ్దుల్ కలాం ‘పల్లెల్లో మౌలిక వసతులు మెరుగుపరచడానికి, పౌర సేవలు సక్రమంగా అందేలా పాలన వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలి’అని చెప్పారు. ఆ స్ఫూర్తిని ఆచరణలోకి తీసుకువచ్చేలా సంస్కరణలకు శ్రీకారం చుట్టారు పవన్ కళ్యాణ్. పంచాయతీరాజ్ పరిపాలన సంస్కరణలపై ఆయన ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. పంచాయతీరాజ్ వ్యవస్థపై అధ్యయనం చేసిన నిపుణులతో 4 నెలలపాటు పలు దఫాలు చర్చలు చేశారు.10 వేలు జనాభా దాటిన పంచాయతీలను ఇకపై రూర్బన్ పంచాయతీలుగా గుర్తిస్తారు. పట్టణ స్థాయి మౌలిక సదుపాయాలను రూర్బన్ పంచాయతీలలో కల్పిస్తారు. వీటి పరిధిలో 359 పంచాయతీలు వస్తాయి. నూతన విధానంలో గతంలో ఉన్న క్లస్టర్ విధానం రద్దు చేసి పంచాయతీలను నాలుగు గ్రేడ్లుగా వర్గీకరించనున్నారు.పంచాయతీ కార్యదర్శి పేరును పంచాయతీ అభివృద్ధి అధికారిగా మార్పు చేశారు.
క్లస్టర్లు ఉండవ్
పునర్వ్యవస్థీకరణతో గ్రామ పంచాయతీలను బలోపేతం చేయడానికి కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చింది. దీనిలో భాగంగా గ్రామ పంచాయతీల్లో క్లస్టర్ వ్యవస్థను రద్దు చేసింది. దీంతో 7,244 క్లస్టర్ల స్థానంలో ఉన్న 13,351 గ్రామ పంచాయతీలు.. ఇక మీదట ఇకపై స్వతంత్ర పరిపాలనా యూనిట్లుగా వ్యవహరిస్తాయి. గ్రామ పంచాయతీలను నాలుగు గ్రేడ్లుగా పునర్ వ్యవస్థీకరించేందుకు కూటమి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటితో పాటు అనేక సంస్కరణలు చేయగా.. ఏపీ కేబినెట్ వీటికి ఆమోదం తెలిపింది. 10 వేలు జనాభా దాటిన పంచాయతీలను “రూర్బన్ పంచాయతీలు”గా గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పట్టణ స్థాయి మౌలిక వసతులను ఈ రూర్బన్ పంచాయతీలకు అందించనున్నారు. గ్రేడ్ 1 పంచాయతీల్లో పని చేస్తున్న 359 మంది కార్యదర్శులకు వేతన శ్రేణి పెంపుతోపాటు డిప్యూటీ ఎంపీడీఓ హోదా కల్పించారు. వీరిని రూర్బన్ పంచాయతీల్లో నియమించనున్నారు. అలాగే, 359 మంది జూనియర్ అసిస్టెంట్లను సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోట్ చేసి, రూర్బన్ గ్రేడ్ పంచాయతీల్లో నియమించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com