CBN: ఏపీలో నేరస్థులకు చోటు లేదు

ఎన్నో అనారోగ్య సమస్యలకు యోగా పరిష్కారమని, యోగా నిత్య జీవితంలో భాగం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. యోగాను దేశంలో ప్రధాని మోదీ ప్రమోట్ చేస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో వెల్నెస్కి చిరునామా అవుతుందని చంద్రబాబు వెల్లడించారు. అందరికి యోగ అందించాలనే లక్ష్యంగా పని చేస్తున్నాం. రామ్ దేవ్ బాబాను ఏపీకి టూరిజం సలహాదారుగా ఉండాలని కోరుతున్నానని అన్నారు. పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించాలని కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగానే విజయవాడలో రెండ్రోజుల టూరిజం కాంక్లేవ్ నిర్వహించారు. దీనికి సీఎం చంద్రబాబుతో పాటు ప్రముఖ యోగా గురువు, పతాంజలి సంస్థ యజమాని బాబా రాందేవ్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు.
కమ్యూనిజం కాదు టూరిజం
కమ్యూనిజం.. సోషలిజం.. క్యాప్టిలిజం.. అన్ని ఇజాలు పోయాయని.. టూరిజం ఒక్కటే మిగిలిందని తాను ఎప్పుడో చెప్పానని చంద్రబాబు గుర్తు చేశారు. తాను గతంలో టెక్నలాజిని ప్రమోట్ చేశానని... గతంలో బిల్ గేట్స్ తో సమావేశం తర్వాత హైదరాబాద్ లో సెంటర్ ఏర్పాటు చేశారని వెల్లడించారు. " ప్రస్తుతం వాట్సాప్ లో 700 కు పైగా సేవలు అందుబాటులో ఉన్నాయి. టూరిజం ఒక్కటే ఉద్యోగాలు ఇవ్వగలదు. ప్రకృతి ఆహారం, యోగతో సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి, శ్రీశైలం తో పాటు అనేక పుణ్య క్షేత్రాలు ఉన్నాయి. కొనసీమ, రాజమండ్రి గోదావరి, మదనపల్లి హార్స్ లీ హిల్స్ వంటి ప్రదేశాలు ఉన్నాయి: అని చంద్రబాబు అన్నారు.
బ్రాడ్ అంబాసిడర్‌గా రామ్‌దేవ్..!
ఆగస్టు 15 లోగా అన్ని సేవలను ఆన్లైన్లో అందిస్తామని తెలిపారు. ఆధ్యాత్మికవేత్తగా ఉన్న బాబా రామ్‌దేవ్ సమాజానికి సేవ చేస్తున్నారని కొనియాడారు. బాబా రామ్‌దేవ్ వివిధ రంగాల్లో తన సేవలు విస్తరించారని గుర్తుచేశారు. ఏపీలో వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేయాలని బాబా రామ్‌దేవ్‌ను కోరుతున్నానని తెలిపారు. బాబా రామ్‌దేవ్ స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తారని స్పష్టం చేశారు. పర్యాటక శాఖకు సలహాదారుగా ఉండాలని బాబా రామ్‌దేవ్‌ను సీఎం చంద్రబాబు కోరారు. యోగా గురువు రామ్ దేవ్ బాబా మాట్లాడుతూ, ఏపీ పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడానికి తాను సిద్ధంగా ఉన్నా నని స్పష్టం చేశారు. ఉత్తర భారత్ వాసులకు ఏపీలో ఉన్న పర్యాటక ప్రాంతాలు చాలా తెలియవని, వాటి గురించి పరిచయం చేయాలని తాను భావిస్తున్నట్లు వెల్లడించారు. యోగా ఆయుర్వేద, నేచురోపతి లాంటి అంశాలను పర్యాటక ప్రాంతాల్లో అవసరమని గుర్తు చేశారు. హార్సిలీ హిల్స్, అరకు, విశాఖ, రాజమహేంద్రమరం, పిచ్చుక లంక, సూర్యలంక లాంటి మంచి ప్రాంతాలు ఉన్నాయని వివరించారు.
టెక్నాలజీ ద్వారా జీరో క్రైం..
ర్యాపిడో వ్యవస్థాపకులు మన గుంటూరుకు చెందిన వారేనని చంద్రబాబు వెల్లడించారు. యాప్ ద్వారా ఆటోలను అనుసంధానం చేసి ప్రయాణ సేవలు అందిస్తున్నారని... ఇప్పుడు అది బిలియన్ డాలర్ల కంపెనీ గా మారిందన్నారు. వినూత్నంగా ఆలోచిస్తే ప్రపంచాన్ని శాసించే అవకాశం వస్తుందన్నారు. " టెక్నాలజీ ద్వారా జీరో క్రైం సాధ్యం. ఆడబిడ్డలను వేధిస్తే అదే వారికి చివరి రోజు కావాలి. వైఎస్ వివేకానందరెడ్డి హత్యలో అసలు విషయం గూగుల్ టేకౌట్ ద్వారా బయటికొచ్చింది. సాంకేతికత సరిగ్గా వినియోగించుకుంటే ఫలితాలు వస్తాయి. మాజీ సీఎం తెనాలికి వచ్చి గంజాయి బ్యాచ్ ను పరామర్శించారు. ప్రజలను వేధించే వారిని అలాగే వదిలేయాలా. ఒకప్పుడు రౌడీ పక్కన నిలబడాలంటే రాజకీయ నాయకులు సిగ్గు పడేవారు. ఇప్పుడు రౌడీలు రాజకీయ నాయకులుగా మారారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు’’ అని చంద్రబాబు హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com