AP: ఎమ్మెల్సీలుగా రామచంద్రయ్య, హరిప్రసాద్
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ కూటమి అభ్యర్థులను ఖరారు చేసింది. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్యకు, జనసేన నుంచి పిడుగు హరిప్రసాద్‌కు అవకాశం కల్పించింది. హరిప్రసాద్ జనసేనాని పవన్ కల్యాణ్‌కు రాజకీయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ నుంచి ఎమ్మెల్సీలుగా గెలుపొందిన సి.రామచంద్రయ్య, మహ్మద్ ఇక్బాల్ టీడీపీలో చేరడంతో ఈ రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. ఎమ్మెల్యే కోటా స్థానాలు కావడంతో ఈ రెండు సీట్లు కూటమి గెలుచుకోవడం ఖాయమే. ఇందులో ఒకటి జనసేనకు ఇవ్వడంతో ఇక్బాల్‌కు అవకాశం దక్కలేదు. ఆయనకు భవిష్యత్తులో మరో అవకాశం ఇస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి. ఈ ఇద్దరు అభ్యర్థులు నేడు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. వీరిలో సి.రామచంద్రయ్య గతంలో మంత్రిగా, ఎంపీగా పనిచేశారు. ఆయన స్వస్థలం కడప జిల్లా మైదుకూరు. ఏలూరుకు చెందిన హరి ప్రసాద్ లా చదివి పాతికేళ్లపాటు మీడియా రంగంలో పనిచేశారు. జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత పార్టీ మీడియా విభాగం అధిపతిగా, పవన్‌కల్యాణ్ రాజకీయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.
తవ్వేకొద్ది తప్పులు, అప్పులు: చంద్రబాబు
వైసీపీ పాలనలో తవ్వేకొద్దీ తప్పులు, అప్పులు బహిర్గతం అవుతున్నాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం పూర్తయితే ప్రతి ఎకరాకు నీరు వచ్చి సంపద సృష్టించేవాళ్లమని... అమరావతి పూర్తయితే ఒక్కో కుటుంబం ప్రతి రోజూ కనీసం రూ.1000 సంపాదించుకునే అవకాశం వచ్చేదని అన్నారు. అలాంటి అవకాశాన్ని గత ఐదేళ్లలో పూర్తిగా జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. ఒక వ్యక్తి సీఎంగా పనికిరాడని ఐదేళ్లు నిరూపించిన ఏకైన వ్యక్తి జగన్ అని విమర్శించారు. ఎన్నికల సమయంలో వాలంటీర్లు వద్దని ఎన్నికల సంఘం ఆదేశిస్తే గత ప్రభుత్వ పెద్దలు పింఛను కోసం వృద్ధులను పంచాయతీ కార్యాలయానికి తిప్పి 33 మంది మరణానికి కారకులయ్యారని చంద్రబాబు గుర్తు చేశారు.
ఎన్టీఆర్ తొలిసారిగా పింఛను పంపిణీ ప్రారంభించారని... అప్పట్లో నెలకు రూ.35 ఇచ్చేవారని తాము దాన్ని 1994-95లో రూ.75కు పెంచామని చంద్రబాబు గుర్తు చేశారు. 2014లో రూ.200 ఉన్న పింఛను రూ.1000కి, తర్వాత రూ.2 వేలకు పెంచిన ఘనత తెలుగుదేశానిదే అని ముఖ్యమంత్రి అన్నారు. ఇప్పుడు రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పింఛన్ పెంచామని... ప్రస్తుతం ఇస్తున్న పింఛనులో రూ.2840 తానె పెంచానని చెప్పడానికి గర్వపడుతున్నానని చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పెనుమాక ఎస్టీకాలనీలో సోమవారం ఉదయం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులకు చంద్రబాబు పింఛను సొమ్ము అందించారు. అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి ఒక్క కుటుంబం గురించి ఆలోచించి అందరికీ న్యాయం చేయడాన్ని బాధ్యతగా తీసుకుంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. తాను అందరివాడినే తప్ప ఏ ఒక్కరివాణ్నీ కాదని స్పష్టం చేశారు. శాశ్వతంగా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించడానికి పనిచేస్తానని ప్రకటించారు. ఇందుకోసం భగవంతుడు ఇచ్చిన శక్తినంతా ఉపయోగించి, ఊపిరి ఉన్నంత వరకు పోరాడతానని మాట ఇచ్చారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com