AP: పేదలకు ఉచితంగా ఇసుక !

AP: పేదలకు ఉచితంగా ఇసుక !
X
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీలక నిర్ణయం... విధివిధానాల రూపకల్పన చేయాలని అధికారులకు ఆదేశం

పేదల ఇంటి నిర్మాణం కోసం ఉచితంగా ఇసుక ఇవ్వాలని, ఇందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినట్లు తెలుస్తోంది. రోడ్లు భవనాలు, పౌరసరఫరాలు, గనులు భూగర్భ శాఖలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో నిత్యావసరాల ధరలు, రహదారుల పరిస్థితి, ఇసుక విధానం అంశాలపై అధికారులతో చర్చించారు. గనుల శాఖ ఉన్నతాధికారులతో జరిపిన సమీక్షలో ఏపీలో ఇసుక పాలసీపై ఆరా తీశారు. టీడీపీ హయాంలో ఇసుక విధానం వల్ల పేదలకు ఎలాంటి మేలు జరిగిందనే విషయాన్ని చంద్రబాబు అధికారులను అడిగి తెలుసుకున్నారు. వైఎస్ జగన్ పాలనలో తీసుకొచ్చిన ఇసుక అమ్మకాల విధానం ఎలా ఉందని కూడా అధికారులను అడిగారు. పేదలు, గృహ నిర్మాణ రంగానికి జరిగిన మొత్తం నష్టంపై అంచనా వేయాలని చంద్రబాబు ఆదేశించారు. వైసీపీ పాలనలో ఇసుక విధానం వల్ల పేదలు తీవ్రంగా నష్టపోయారని, గృహ నిర్మాణ రంగం కుదేలైందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఇసుక రీచ్‌లు, డంప్‌లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రైవేటు వ్యక్తుల కబంధహస్తాల్లో ఉందని సమాచారం ఉందని, ధరలను విపరీతంగా పెంచి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఇసుక ధరలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. రీచ్‌లు, స్టాక్‌పాయింట్లు, డంప్‌ల పరిధిలో అందుబాటు ఉన్న ఇసుకపై అధికారులను ప్రశ్నించారు. దాదాపు 40 లక్షల టన్నుల ఇసుక అందుబాటులో ఉందని ఈ సందర్భంగా అధికారులు చెప్పినట్టు తెలిసింది.

ఈ ఇసుకను ప్రజలకు అందుబాటులో తేవాలంటే తీసుకోవాల్సి చర్యలపై గనుల శాఖ డైరెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ను సీఎం ఆరా తీశారు ‘ఆ ఇసుకపై ఎవరు అజమాయిషీ చేస్తున్నారని అధికారులను చంద్రబాబు అడిగారు. భారీ కొండలను తలపించే డంప్‌లు ఎవరి అధీనంలో ఉన్నాయని.. వాటిని ఇంకా ఎందుకు స్వాధీనం చేసుకోలేదని సీఎం నిలదీశారు. ఉచిత ఇసుక పాలసీతో పాటు గతంలో జరిగిన తప్పిదాలు, ఇతర అంశాలపై మరోసారి గనులశాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి నేడు సమీక్ష నిర్వహించనున్నారు. ఇందుకు సమగ్ర నివేదికలతో రావాలని ఆయన ఆదేశించారు.

అంతేకాదు, ఇకపై ఆఫ్‌లైన్‌‌లో ఇసుక అమ్మకాలు జరగడానికి వీల్లేదని అధికారులు స్పష్టం చేశారు. ఉచిత ఇసుకతోపాటు ఇతర మార్గాల ద్వారా సరఫరా చేసే ఇసుకను ఆన్‌లైన్‌‌లో బుక్ చేసుకునే విధానం తీసుకురావాలని చంద్రబాబు తేల్చిచెప్పినట్టు సమాచారం. సీఎం ఆదేశాలకు అనుగుణంగా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించనున్నారు.

Tags

Next Story