AP: ఏపీలో ప్రతీ నెలా "పేదల సేవ"

AP: ఏపీలో ప్రతీ నెలా పేదల సేవ
కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు వెల్లడి.... కలెక్టర్లకు మార్గ నిర్దేశం

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి నెలా ఒకటో తేదీన పేదల సేవలో పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా అధికారులు పేదల స్థితి గతులను తెలుసుకోవాలని ఆదేశించారు. ఏం చేస్తే ప్రజలు పేదరికం నుంచి బయటపడతారో ఆలోచించాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. పేదలతో మాట్లాడాలని.. వారి కోసం ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాలని కలెక్టర్ల సదస్సులో ఆదేశించారు. బాగా పనిచేసే జిల్లా కలెక్టర్లను ప్రోత్సహిస్తామని, పాలనలో స్థిరత్వం కోసం అవసరమైతే ఐదారేళ్లూ వారినే కొనసాగిస్తామని చంద్రబాబు స్పష్టంచేశారు. సమర్థంగా పనిచేయని వారికి గ్యారంటీ ఇవ్వలేమని పేర్కొన్నారు.


తమ ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలుండవని స్పష్టం చేసిన చంద్రబాబు... అలాగని తప్పు చేసిన వారిని వదిలిపెట్టబోమని తేల్చి చెప్పారు. తప్పు చేసి తప్పించుకుంటామంటే, అది ప్రభుత్వ అసమర్థతే అవుతుందన్నారు. మళ్లీ తప్పు చేయాలంటే భయపడేంతగా చర్యలుంటాయని హెచ్చరించారు. మంత్రులు, కలెక్టర్లు, సీనియర్‌ కార్యదర్శులు సహా అందరూ క్షేత్రస్థాయిలో పర్యటించాలని... మారుమూల ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. అక్కడ వచ్చే ఆలోచనలే మీ పని విధానంలో మార్పు తెస్తాయన్నారు. కలెక్టర్లు ఉత్సాహంగా పని చేస్తామంటే ప్రోత్సహించే నాయకత్వం మీ ముందుందని పవన్ అన్నారు. ప్రతి జిల్లాకు రెండో సంయుక్త కలెక్టర్‌ను కేటాయిస్తామని, మూడు నెలలకోసారి కలెక్టర్ల సదస్సు ఏర్పాటు చేసి సమీక్షించుకుందామని చెప్పారు. రోజులు, గంటల తరబడి సమావేశాలుండవని పేర్కొన్నారు.

హంగూ, ఆర్భాటాల్లేకుండా సమర్థంగా పాలన సాగాలని చంద్రబాబు సూచించారు. ముఖ్యమంత్రి పర్యటన అంటే చెట్లు కొట్టడం, రెడ్‌ కార్పెట్లు వేయడం, పరదాలు కట్టడం, మనుషుల్ని బలవంతంగా తెచ్చి సభల్లో నిలబెట్టడం కాదన్నారు. మనకు హోదా ఇచ్చింది ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి కాదని... కలెక్టర్ల ప్రయాణాల్లోనూ వాహనాలు నిలిపేయడం, సైరన్లు పెట్టడం చేయొద్దన్నారు. ఎమ్మెల్యేలు కూడా వాహనాలకు సైరన్‌ పెట్టారని... దీంతో తెలియకుండానే ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుంటారని అన్నారు. పెద్దపెద్ద సభలు పెట్టొద్దని... ఐదేళ్ల క్రితం ప్రజావేదిక కేంద్రంగా కలెక్టర్ల సమావేశం పెట్టిన అప్పటి ముఖ్యమంత్రి.. ఆ వెంటనే భవనం కూల్చేయాలని ఆదేశించి విధ్వంసానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. ఆ తర్వాత ఒక్కసారి కూడా కలెక్టర్ల సదస్సు పెట్టలేదంటే ఆ ప్రభుత్వ పాలనా విధానాన్ని అర్థం చేసుకోవచ్చన్నారు.

Tags

Next Story