CBN: ప్రమాదమా..? కుట్ర పూరితమా..?

అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో కీలక పత్రాలు దహనం కుట్రపూరితంగా జరిగినట్లు అనిపిస్తోందని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఘటనా స్థలంలో సీసీ కెమెరాలు పనిచేయట్లేదని..... దస్త్రాలతోపాటు కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లూ పూర్తిగా కాలిపోయాయ్ననారు. షార్ట్ సర్క్యూట్ అయినట్లు కూడా కనిపించట్లేదన్న ఆయన... కొత్త సబ్‌కలెక్టర్ బాధ్యతలు చేపట్టడానికి కొన్ని గంటల ముందు ఘటన జరగటం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. ఇది ప్రమాదమా, కుట్రపూరితమా తేల్చాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మొన్నటి వరకూ అధికారంలో ఉన్న వ్యక్తులు నేరాలకు పాల్పడి ఆధారాలు మాయం చేయటంలో సిద్ధహస్తులని, ఆ కోణంలో లోతైన దర్యాప్తు జరపాలని నిర్దేశించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సన్నిహితంగా పనిచేసిన కొందరు అధికారులు, రెవెన్యూ సిబ్బందికి ఈ ఘటనలో ప్రమేయముందన్న సమాచారం అందుతున్న నేపథ్యంలో అన్ని కోణాల్లోనూ విచారించాలని సూచించారు. సమగ్ర వివరాల్ని ఎప్పటికప్పుడు తన ముందుంచాలన్నారు.
దస్త్రాల దహనం ఘటనపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, డీజీపీ, నిఘా విభాగాధిపతి, ఇతర అధికారులతో చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఎసైన్డ్ భూములు, 22ఏ జాబితాలోని భూములు, వివాదాస్పద భూములు, హైవే ప్రాజెక్టుల భూసేకరణ సంబంధిత దస్త్రాలు దహనమైనట్లు ప్రాథమిక సమాచారం అందిందని చెప్పారు. డీజీపీ ద్వారకా తిరుమలరావు, సీఐడీ విభాగాధిపతి రవిశంకర్ అయ్యన్నార్‌లను హుటాహుటిన హెలికాప్టర్‌లో మదనపల్లెకు వెళ్లాలని ఆదేశించగా.. వారు వెంటనే అక్కడికి చేరుకున్నారు.
నేరం జరిగిన సమయంలో సత్వరం స్పందించని అధికారులపై చర్యలు ఉంటాయని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయం నుంచి గ్రామ స్థాయి వరకూ అధికారుల పనితీరులో మార్పు రావాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం మారిన తర్వాత కూడా కొందరు అధికారులు, ఉద్యోగులు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారనే ఆరోపణలకు బలం చేకూర్చేలా తాజా ఘటన ఉందన్నారు. ఇలాంటి విషయాల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చరించారు. మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో పత్రాల దహనం ఘటనపై చేపట్టిన విచారణలో వెలుగుచూసిన అంశాల్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు అన్నమయ్య జిల్లా కలెక్టర్, సీఎంఓ అధికారులు వివరించారు. ఘటనా స్థలం నుంచి సేకరించిన ఫోరెన్సిక్ ఆధారాల గురించి తెలియజేశారు. ఈ ఘటనపై చుట్టుపక్కల ప్రజలకు ఏమైనా సమాచారం ఉందా అనేది తెలుసుకోవాలని, ఉద్యోగుల నుంచి వివరాలు రాబట్టాలని ముఖ్యమంత్రి వారిని ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com