CBN: ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోండి

CBN: ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోండి
X
ప్రధాని మోదీని కోరిన సీఎం చంద్రబాబునాయుడు... పలువురు కేంద్రమంత్రులతో భేటీ

గత ప్రభుత్వ పాలనలో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌ను పెద్ద మనసు చేసుకుని ఆదుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు... ప్రధాని మోదీని కోరారు. సీఎంగా అధికారం చేపట్టిన తర్వాత తొలిసారి ఢిల్లీ వచ్చిన చంద్రబాబు ప్రధానమంత్రితో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ను అన్ని విధాల ఆదుకోవాలని కోరారు. ఏడు ప్రాధాన్యాంశాలను ప్రధాని ముందు ఉంచిన చంద్రబాబు... సంపూర్ణ సహకారం అందించాలని విన్నవించారు. ఏపీకి ఆర్థికంగా చేయూత.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సహకారం, అమరావతిలో ప్రభుత్వ సముదాయాలు, మౌలిక సదుపాయాలకు సమగ్ర ఆర్థిక మద్దతు.. పారిశ్రామికాభివృద్ధికి ప్రోత్సాహకాలు.. రోడ్లు, వంతెనలు, నీటిపారుదల, తాగునీటి ప్రాజెక్టుల వంటి అత్యవసర రంగాలను దృష్టిలో ఉంచుకుని పెట్టుబడి వ్యయం కోసం ప్రత్యేక సాయం కింద అదనపు కేటాయింపులు.. బుందేల్‌ఖండ్‌ తరహాలో వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజీ, దుగరాజపట్నం రేవు అభివృద్ధికి తోడ్పాటు అందించాలని అభ్యర్థించారు.


గత ఐదేళ్లలో జగన్‌ దుర్మార్గమైన, దుష్టపాలనలో విచ్చలవిడిగా అవినీతి జరిగిందని, విభజన వల్ల జరిగిన నష్టం కంటే ఎక్కువ విఘాతం ఆయన పాలన వల్లే జరిగిందని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వానికి వ్యూహాత్మక దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలంటూ లేకపోవడం.. దుందుడుకు విఽధానాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా దిగజారిందన్నారు. రాష్ట్రంలో ఆర్థిక వనరుల లోటు తీవ్రంగా ఉందని వివరించారు. ‘జీతాలు, పింఛన్లు, అప్పుల చెల్లింపు వంటి ఖర్చులు తప్పవు. ఇవి రాష్ట్ర రెవెన్యూ వసూళ్లను మించిపోయాయి. దీనివల్ల ఉత్పాదక మూలధన పెట్టుబడులకు నిధులే లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. భవిష్యత్‌ ఎక్సైజ్‌ ఆదాయాలను, ప్రభుత్వ భవనాలను కూడా తాకట్టు పెట్టి విచ్చలవిడిగా అప్పులు తెచ్చారు. నిధులను పెద్ద ఎత్తున మళ్లించారు. దీంతో వనరులకు తీవ్ర కొరత ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో కేంద్రం ఆర్థికంగా చేయూతనివ్వడం తప్ప గత్యంతరం లేదు. అప్పుడే ఈ సవాళ్లను ఎదుర్కోగలం’ అని పేర్కొన్నారు


అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు సహకరించాలని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి, విద్యుత్‌ శాఖల మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ను చంద్రబాబు కోరారు. ఏపీకి సంబంధించి పలువురు జాతీయ రహాదారుల నిర్మాణానికి సంబంధించి సీఎంతో విస్తృతంగా చర్చించానని కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. ఏపీ తన శక్తి సామర్థ్యాలను పూర్తిగా ఉపయోగించుకునేందుకు సంసిద్ధంగా ఉందని.. రాష్ట్రాన్ని సుసంపన్నమైన, అభివృద్ధి బాటలో తీసుకెళ్లగలమనే విశ్వాసం తనకుందని చంద్రబాబు తెలిపారు. వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌తో జరిపిన భేటీలో సహకార సమాఖ్య స్ఫూర్తితో చర్చలు జరిగాయన్నారు. కేంద్ర వ్యవసాయ శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, పెట్రోలియం మంత్రి హర్దీ్‌పసింగ్‌ పురీతో కూడా ఆయన సమావేశమయ్యారు. ఉదయం పీయూష్‌ గోయల్‌తో అల్పాహార విందు సమావేశంతో తన షెడ్యూల్‌ను ప్రారంభించిన చంద్రబాబు.. సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశాలు నిర్వహించారు. రాత్రికి ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌కు చెందిన పలువురు సీనియర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు, మాజీ అధికారులకు విందు ఇచ్చారు. రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలని కోరారు.

Tags

Next Story