CBN: వంద రోజుల్లో వ్యవస్థలను గాడిలో పెడతాం

CBN: వంద రోజుల్లో వ్యవస్థలను గాడిలో పెడతాం
వైసీపీ పాలనలో మండలానికో భూ కుంభకోణం...తప్పు చేసిన వారందరూ జైలుకే అన్న చంద్రబాబు

వై.ఎస్‌. జగన్‌ పాలనలో మండలానికో భూ కుంభకోణం జరిగిందని.. వైసీపీ నేతలు, కొందరు అధికారులు కుమ్మక్కై పెద్దఎత్తున భూకబ్జాలు, ఆక్రమణలకు పాల్పడ్డారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఘాటు విమర్శలు చేశారు. రికార్డుల్ని తారుమారు చేయడం, ఆన్‌లైన్లో పేర్లు మార్చేయడం వంటివి యథేచ్ఛగా చేశారని మండిపడ్డారు. గ్రీవెన్స్‌లో 90 శాతం ఈ తరహా సమస్యలే వస్తున్నాయని గుర్తుచేశారు. వీటిపై సమగ్ర విచారణ చేసి బాధ్యుల్ని శిక్షిస్తే.. అందరూ దారిలోకి వస్తారని స్పష్టం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన చంద్రబాబు.. విలేకరులతో ఇష్టాగోష్ఠిగా ముచ్చటించారు. రాబోయే వంద రోజుల్లో దెబ్బతిన్న వ్యవస్థల్ని గాడిలో పెడతామని ధీమా వ్యక్తం చేశారు.


వైసీపీ వాళ్లు గత ఐదేళ్లలో చేసిన విధ్వంసాన్ని సరిచేయాలంటే పదేళ్లు పడుతుందని చంద్రబాబు అన్నారు. ఆ స్థాయిలో వాళ్లు ఆంధ్రప్రదేశ్‌ను నాశనం చేసారని మండిపడ్డారు. భూముల రీసర్వే అస్తవ్యస్తంగా చేయడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని... రెవెన్యూ వ్యవస్థను ఎంతలా నిర్వీర్యం చేశారో మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో భూ రికార్డుల్ని దహనం చేసిన ఘటనే ఓ ఉదాహరణ అని వెల్లడించారు. త్వరలో ఈ కేసునూ కొలిక్కి తెస్తామని... బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు. భూకబ్జాలు చేసిన వారిని, వారికి సహకరించిన అధికారుల్ని చట్టప్రకారం శిక్షిస్తామని తేల్చి చెప్పారు.

ప్రజల నుంచి వినతులు స్వీకరించడంతో పాటు వాటి పరిష్కారాన్నీ లక్ష్యంగా పెట్టుకున్నామని చంద్రబాబు తెలిపారు. ప్రతి సమస్యనూ సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని.... దీనికోసం నిర్దిష్ట కాలపరిమితి పెడతాం. శాఖల వారీగా వాటిని విభజించి, సంబంధిత అధికారులకు పంపుతామని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ప్రజలు పెద్దఎత్తున తెదేపా కేంద్ర కార్యాలయానికి వారి సమస్యలు చెప్పుకొనేందుకు వస్తున్నారని.. ఈ పరిస్థితి లేకుండా జిల్లాల పార్టీ కార్యాలయాల్లోనే వినతులు స్వీకరించేలా ఏర్పాట్లు చేస్తామని సీఎం వివరించారు. ఆ జిల్లా మంత్రితో పాటు పార్టీ నుంచి ముఖ్య నేతలు రోజూ అందుబాటులో ఉంటారన్నారు. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు కూడా వినతులు స్వీకరించేలా యంత్రాంగాన్ని రూపొందిస్తామని వివరించారు. ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఓ వరస ఏర్పాటు చేయాలని పక్కనే ఉన్న టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు సూచించారు.తన పర్యటనల్లో ఎవరికీ ఇబ్బంది కలగకుండా చూస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Tags

Next Story