AP: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు ప్రాణం పోశారు

కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం తగిన గుర్తింపు ఇచ్చిందని, ఇకపైనా సహకరించాలంటూ చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. వెంటిలేటర్‌పై ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు కేంద్ర బడ్జెట్ ద్వారా ఆక్సిజన్ అందించారని అభివర్ణించారు. ఇది ప్రారంభం మాత్రమేనని, దీన్ని వినియోగించుకుని మరింత కష్టపడతామని పేర్కొన్నారు. ఏపీ వనరులు, ఇబ్బందులు, అభివృద్ధి ప్రణాళికలు, సూపర్ సిక్స్ పథకాల అమలు తదితర అంశాలన్నింటిపైనా బడ్జెట్‌లో వివరిస్తామని చెప్పారు. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనసభలో జరిగిన చర్చకు చంద్రబాబు మంగళవారం సమాధానమిచ్చారు. అసెంబ్లీలో చంద్రబాబు ప్రసంగిస్తూ ‘మల్టీ లేటరల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీల ద్వారా అమరావతికి రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం అందిస్తామంటూ కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదించారని ఇది శుభ పరిణామమని అన్నారు.
పోలవరం ప్రాజెక్టులో ప్రస్తుత డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడంతో దానికి సమాంతరంగా మరోటి నిర్మించాల్సి ఉందని..... అదయ్యాక వీలైనంత తొందర్లో ప్రాజెక్టు పూర్తి చేస్తామని కేంద్రం ముందుకొచ్చిందన్నారు. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామికవాడల్లో పరిశ్రమల అభివృద్ధికి అదనపు నిధులు ఇచ్చేందుకు అంగీకరించిందన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రతో పాటు ప్రకాశం జిల్లాకూ వెనకబడిన జిల్లాల అభివృద్ధి నిధి కింద ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించిందని తెలిపారు. ఆర్థికాభివృద్ధికి తోడ్పడేలా మూలధన వ్యయం చేసేందుకు అవసరమైన ఆర్థిక చేయూతనందించడానికి ముందుకొచ్చిందని వెల్లడించారు.
కేంద్రం హామీ
పోలవరం ప్రాజెక్టుకు అండగా ఉంటామని కేంద్ర ప్రభుత్వం నుంచి కూటమి ప్రభుత్వానికి గట్టి భరోసా దక్కింది. పోలవరం ప్రాజెక్టును తామే పూర్తి చేస్తామని, అవసరమైన నిధులిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. త్వరితగతిన నిధులిచ్చి, ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని తేల్చి చెప్పింది. పోలవరం ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి మాత్రమే కాదని.. యావద్దేశానికి ఆహార భద్రత అందించే కీలక ప్రాజెక్టు అని కేంద్ర మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ఆశలకు కేంద్రం ఊపిరి పోసినట్లయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com