CBN: పోలవరానికి నిధులు కేటాయించండి
పోలవరానికి సాధ్యమైనంత త్వరగా నిధులు కేటాయించాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. శ్రమశక్తి భవన్‌లో కేంద్రమంత్రితో భేటీ అయిన చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై కూలంకషంగా చర్చించారు. పోలవరం ప్రాజెక్టు మొదటి దశకు అవసరమైన రూ.12,500 కోట్ల ప్రతిపాదనలను కేంద్ర మంత్రివర్గం వెంటనే ఆమోదించేలా చూడాలని కోరినట్లు చెప్పారు. నవంబర్లో పనులు ప్రారంభించాలనుకుంటున్నామని, ఆ మేరకు నిధులివ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రం వాల్ నిర్మించడానికి ప్రతిపాదనలను కేంద్రం ముందు ఉంచినట్లు తెలిపారు. ప్రాజెక్టు పనులపై మూడు నెలల్లో ఒక నిర్ణయం తీసుకుని పనులు చేపట్టకపోతే.. మరో సీజన్ కూడా కోల్పోయే అవకాశం ఉందని చంద్రబాబు అన్నారు. వరద తగ్గిన వెంటనే పనులు మొదలు పెడితే పనులు కొలిక్కి రావడానికి రెండు సీజన్లు పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు.
వచ్చే పదేళ్లలో అగ్రగామి ఏపీనే
వచ్చే దశాబ్దంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అగ్రగామిగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జల వనరులు, ఖనిజ వనరులు, సువిశాలమైన కోస్తా తీరం, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, సారవంతమైన భూమి వంటి అభివృద్ధికి అవసరమైన వనరులు ఏపీలో పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. ఢిల్లీలో నిర్వహించిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో అందరికంటే ముందు మాట్లాడిన చంద్రబాబు ఏపీ అభివృద్ధిపై ధీమా వ్యక్తం చేశారు. కొంతకాలంగా తాను చేస్తున్న వినూత్న ప్రతిపాదన పీ-4 గురించి చంద్రబాబు ప్రస్తావించారు. దీన్ని జాతీయ స్థాయిలో అమలు చేయాలని కోరినప్పుడు సమావేశంలో సానుకూల ప్రతిస్పందన లభించింది.
త్వరలో ఉచిత ప్రయాణం
ఆంధ్రప్రదేశ్‌లో మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి రంగం సిద్ధమవుతోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుపై ఆర్టీసీ అధికారులు ఇప్పటికే అధ్యయన నివేదికను సిద్ధం చేశారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఏపీఎస్‌ఆర్టీసీకి నెలకు రూ.250 కోట్ల వరకు భారం పడుతుందని అంచనా వేశారు. ఇప్పటికే ఈ పథకం అమలుచేస్తున్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లిన అధికారులు.. అక్కడ ఏయే బస్సుల్లో ఉచిత సదుపాయం కల్పిస్తున్నారు, ప్రభుత్వం నుంచి రీయింబర్స్‌మెంట్ ఎలా. అన్న అంశాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. సీఎం చంద్రబాబు ఆర్టీసీ, రవాణా శాఖలపై రేపు(సోమవారం) నిర్వహించనున్న సమీక్షలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుపై కీలక చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో అధికారులు ముందుగా నివేదికను రూపొందించారు.
Tags
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com