CBN: విద్యా వ్యవస్థను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

CBN: విద్యా వ్యవస్థను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
X
దేశ చరిత్రలోనే తొలిసారి మెగా పేరెంట్స్‌-టీచర్స్‌ సమావేశం.. గంజాయికి దూరంగా ఉండాలని చంద్రబాబు హితబోధ

ఆంధ్రప్రదేశ్ లో విద్యా వ్యవస్థను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దేశ చరిత్రలోనే తొలిసారి మెగా పేరెంట్స్‌-టీచర్స్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చంద్రబాబు, లోకేశ్ పాల్గొన్నారు. పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంటుదని చంద్రబాబు అన్నారు. ఒత్తిడి లేని చదువులు, నైతిక విలువలే లక్ష్యం కావాలని అన్నారు. మెగా పేరెంట్‌ టీచర్‌ మీటింగ్‌ కార్యక్రమం సందర్భంగా బాపట్ల మున్సిపల్‌ హైస్కూల్‌కు వచ్చిన సీఎం చంద్రబాబు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మమేకం అయ్యారు. ఇక్కడ ఆయన వ్యవహరించిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇంటి పెద్దలా, సొంత మనిషిలా తమ దగ్గరకు వచ్చి ఇబ్బందులు విన్నారని తల్లిదండ్రులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. హైస్కూల్‌ పదో తరగతి గదిలోకి విద్యాశాఖ మంత్రి లోకేశ్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లారు. అక్కడ కూర్చుని.. పదో తరగతి విద్యార్థిని మీనాక్షి, ఆమె తండ్రితో మాట్లాడారు. నీ లక్ష్యం ఏమంటని సీఎం ప్రశ్నకు నేచురల్‌ ఫార్మింగ్‌ తన గోల్‌ అని మీనాక్షి సమాధానమివ్వడంతో ఆమెను మెచ్చుకున్నారు.

గంజాయికి దూరంగా ఉండాలి

గంజాయి, డ్రగ్స్‌కు విద్యార్థులు దూరంగా ఉండాలని చంద్రబాబు అన్నారు. ఇవి క్యాన్సర్‌కన్నా భయానకమైనవి. వీటికి ఆకర్షితులైతే జీవితం నాశనమవుతుందన్నారు. వాటిపై ఉక్కుపాదం మోపుతామని చంద్రబాబు తెలిపారు. ఏటా డిసెంబరు 7న పేరెంట్స్‌-టీచర్స్‌ డే నిర్వహిస్తామని తెలిపారు. స్టూడెంట్‌- పేరెంట్స్‌- టీచర్‌- ప్రభుత్వం పనిచేస్తేనే విద్యలో ఫలితాలు మంచిగా ఉంటాయన్నారు. "మూడు నెలలకోసారి సమావేశాలు పెడతాం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలి. తల్లిదండ్రులు పిల్లలతో కూర్చొని చదువులపై చర్చించుకోవాలి. పిల్లల ఆలోచన విధానం, ఆశలు, ఆకాంక్షల్ని గుర్తెరగాలి. అమ్మానాన్నల కలలను సాకారం చేయటానికి విద్యార్థులు శ్రమించాలి. పిల్లల చదువులు, వారికి వస్తున్న మార్కులు.. బడికి వెళ్లలేకపోయినా వెంటనే తల్లిదండ్రుల సెల్‌ఫోన్‌కు వాట్సప్‌ సందేశం పంపే విధానాన్ని త్వరలోనే తీసుకొస్తాం. విద్యాశాఖ సముద్రం లాంటిది. ఫలితాలు వెంటనే కనిపించవు." అని చంద్రబాబు అన్నారు.

నారా లోకేశ్ ను ఓడించిన చంద్రబాబు

బాపట్ల మున్సిపల్ పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. ఇండోర్ స్టేడియంలో తండ్రీ కొడుకులు సరదాగా థగ్ ఆఫ్ వార్ ఆడారు. చంద్రబాబు వైపు ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, అధికారులు ఉండగా.. లోకేశ్ వైపు ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్, ఇతర అధికారులు ఉన్నారు. చివరికి లోకేశ్ పై చంద్రబాబు జట్టు విజయం సాధించింది.

Tags

Next Story