AP: ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం

AP: ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం
X
ఆక్రమణలను చూస్తూ ఊరుకోబోమన్న చంద్రబాబు... కొల్లేరులో ఆక్రమణలను తొలగిస్తామన్న సీఎం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తామని అన్నారు. చట్టం అమల్లోకి రాగానే మొట్ట మొదటగా బుడమేరు ఆక్రమణలే తొలగిస్తామని చెప్పారు. కొంతమంది ఆక్రమణల కారణంగా లక్షల మంది ఇబ్బంది పడుతున్నారని, దానిని చూస్తూ ఊరుకోమన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆక్రమణలు తొలగించేలా పటిష్ట చట్టం తెస్తామని చంద్రబాబు అన్నారు. అంతేకాకుండా.. బుడమేరు ఆక్రమణలు తొలగిస్తామని చెప్పారు. కొంతమంది ఆక్రమణల కారణంగా లక్షల మంది ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోమని పేర్కొన్నారు. కొల్లేరులో ఆక్రమణలు వల్ల నీరు వెనక్కి తన్నే పరిస్థితి ఉంది.. దీనిని పరిశీలించి ఆక్రమణలు కొట్టేస్తామన్నారు. రాజకీయ అండతో కొందరు విచ్చలవిడిగా చేశారు.

ప్రజా భద్రత కంటే ఈ ప్రభుత్వానికి ఏదీ ముఖ్యం కాదు ముఖ్యమంత్రి తెలిపారు. ప్రజల్లో నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ఏం చేయాలో అన్నీ చేస్తున్నామన్నారు. 5 ఏళ్లలో డ్రైన్ లన్నీ నాశనం చేశారని దుయ్యబట్టారు. అన్నీ కూడా ఆధునికీకరిస్తామని చంద్రబాబు చెప్పారు. వరద రావటానికి కారణాలు, ప్రభుత్వం తీసుకున్న సహాయక చర్యలు గవర్నర్ కు నివేదించానని చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వ చర్యల పట్ల గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. త్వరలోనే సాధారణ పరిస్థితి నెలకొంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలో ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉన్నందున అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఏలేరు ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ఉధృతిని నిశితంగా పరిశీలిస్తూ అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విశాఖ, అల్లూరి జిల్లాల్లో కొండచరియలు విరిగిపడే ప్రమాదం గుర్తించి ముందస్తు హెచ్చరికలు పంపామని ముఖ్యమంత్రి తెలిపారు.

చరిత్ర చూడని నష్టం..

రోడ్లపై బురద పేరుకుపోకుండా చేస్తున్నామని, ఇసుక, మట్టి లేకుండా శుభ్రం చేస్తున్నామని చెప్పారు చంద్రబాబు. వర్షాలు, వరదల కారణంగా బైక్ లు, ఆటోలు, కార్లు పాడైపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. టీవీలు, ఫ్రిజ్ లు, మిక్సీలు.. ఇలాంటి గృహోపకరణాలు కూడా పాడైపోయాయనే ఫిర్యాదులు వస్తున్నాయని, వాటికి మరమ్మతులు చేయించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా కృష్ణానదికి వరద వచ్చిందని, వాతావరణంలో పెను మార్పులు దీనికి కారణం అని అధికారులు, నిపుణులు చెబుతున్నారని అన్నారు సీఎం చంద్రబాబు. బుడమేరు కబ్జాల వల్ల వరదనీరు లోతట్టు ప్రాంతాలకు చేరిందని, లక్షలమంది ఇబ్బంది పడ్డారని అన్నారు.

Tags

Next Story