CBN: అత్తాకోడళ్లపై అత్యాచారంపై చంద్రబాబు కీలక నిర్ణయం

CBN: అత్తాకోడళ్లపై అత్యాచారంపై చంద్రబాబు కీలక నిర్ణయం
X
ప్రత్యేక కోర్టు ద్వారా విచారణ జరిపించాలని ఆదేశం.. లైంగిక వేధింపులపై ఉక్కుపాదం మోపాలన్న సీఎం

ఏపీలో మహిళలపై నేరాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. శ్రీసత్యసాయి జిల్లాలో అత్తాకోడళ్లపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. నిందితులకు తక్షణం శిక్షలు పడేలా చేయాల్సిన అవసరం ఉందని భావించిన చంద్రబాబు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి కేసును విచారించాలని సూచించారు. గతంలో బాపట్ల జిల్లాలో మహిళపై సామూహిక అత్యాచారం, హత్య ఘటనపై సైతం ప్రత్యేక కోర్టు ద్వారా విచారణ జరిపించాలని సూచించారు.

త్వరితగతిన న్యాయం చేయాలి

లైంగిక వేధింపులు, మహిళలపై దాడి వంటి అంశాలలో త్వరగా న్యాయం చేయాలన్నదే ప్రభుత్వ విధానం అని చంద్రబాబు స్పష్టం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ఘటనలో ఇప్పటికే పలు కీలకాంశాలను దర్యాప్తు బృందం రాబట్టిందన్నారు. నిందితులు దొంగతనాలతో పాటు అత్యాచారానికి పాల్పడుతున్నారని విచారణలో తేలిందన్నారు. మహిళలపై జరిగే నేరాలలో నిందితులకు ఖచ్చితంగా, వేగంగా శిక్ష పడాలన్నారు. శిక్ష తప్పదనే భయం నేరగాళ్లలో రావాలన్నారు. నేరగాళ్లను గుర్తించి, కఠినంగా శిక్షలు వేయడానికి టెక్నాలజీ ద్వారా సాక్ష్యాలను సేకరించాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఏపీలో శాంతి భద్రతలు కాపాడటానికి, మహిళలకు స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నేరస్తులను పట్టుకోవడంలో సిసి కెమెరాలు సహా ఇతర టెక్నాలజీ అంశాలను వాడుకోవాలని చంద్రబాబు సూచించారు. నేరస్తులను వెంటనే గుర్తించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సీసీటీవీ కెమెరాల సంఖ్యను పెంచే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. నేరాలను అరికట్టేందుకు ప్రజల సహకారం కూడా తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా లైంగిక వేధింపులు, ఘర్షణలు, అసాంఘిక కార్యకలాపాలు జరిగితే ఆధారాలను పోలీసులతో పంచుకోవాలని సూచించారు.


అసలేమైందంటే

సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలోని ఓ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు అత్త, కోడలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉపాధి నిమిత్తం గ్రామానికి వచ్చారు. ఓ నిర్మాణం వద్ద వారంతా వాచ్‌మెన్‌, తదితర విధులను నిర్వర్తిస్తున్నారు. ఈక్రమంలో శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని నలుగురు వ్యక్తులు రెండు ద్విచక్ర వాహనాల్లో వచ్చారు. నిర్మాణం వద్ద నివాసం ఉంటున్న అత్త, కోడలిని కత్తులతో బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అడ్డు వచ్చిన తండ్రీ, కుమారుడిని బెదిరించారు. ఈ ఘటనపై బాధితులు చిలమత్తూరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. అత్యాచారానికి పాల్పడిన వారిని వెంటనే పట్టుకుంటామని హామీ ఇచ్చారు.

Tags

Next Story