SHARMILA: ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల కీలక ప్రకటన

SHARMILA: ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల కీలక ప్రకటన
X
పార్టీలు అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్లు వెల్లడి.... నీట్‌పై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్ అధ్యక్షురాలు వై.ఎస్‌. ష‌ర్మిల కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్‌ పార్టీలోని అన్ని క‌మిటీల‌ను ర‌ద్దు చేసిన‌ట్టు ఆమె ప్రక‌టించారు. త్వర‌లో కొత్త క‌మిటీల‌ను వేస్తామ‌ని ఆమె చెప్పారు. కాంగ్రెస్ ఎదుగుల‌కు ష‌ర్మిలే అడ్డంకి అంటూ ఇటీవ‌ల ఆమెపై పెద్ద ఎత్తున సొంత పార్టీ నేత‌లు విమ‌ర్శలు గుప్పించారు. ఆమెపై ఢిల్లీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. పార్టీ కార్యక‌ర్తలు, నాయ‌కుల‌కు ఆమె అందుబాటులో వుండ‌ర‌నేది ప్రధాన విమ‌ర్శ‌. క‌నీసం సెల్‌ఫోన్‌లో మాట్లాడాల‌న్నా కుద‌ర‌డం లేద‌ని ఆమె వ్యతిరేకులు తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో త‌న‌కు అనుకూల‌మైన వారికి క‌మిటీల్లో స్థానం క‌ల్పించేందుకు ష‌ర్మిల‌, పాత వాటిని ర‌ద్దు చేశార‌ని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అగ్ర‌నేత‌లు సోనియా, రాహుల్‌, ప్రియాంక గాంధీల‌ను ఆమె క‌లుసుకున్నారు. ఏపీలో కాంగ్రెస్ బ‌లోపేతంపై చ‌ర్చించారు. ఢిల్లీ నుంచి ఏపీకి వ‌చ్చిన ఆమె కాంగ్రెస్‌ను సంస్థాగ‌తంగా బ‌లోపితం చేయ‌డంపై దృష్టి సారించారు.

నీట్‌పై సీబీఐ విచారణ జరపాలి


నీట్‌ పేపర్‌ లీక్‌ కావడంపై సీబీఐతో విచారణ జరిపించాలని షర్మిల కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు ‘నీట్‌ పేపర్‌ లీకేజీ అంశంపై’ విజయవాడ ధర్నాచౌక్‌లో ఆందోళన నిర్వహించారు. విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన, వైసీపీ.. బీజేపీ తొత్తు పార్టీలు కావడంతోనే ఈ అంశంపై చంద్రబాబు, పవన్‌ కల్యాణ్, జగన్‌ మాట్లాడటం లేదని విమర్శించారు.

షర్మిలపై ఫిర్యాదు

షర్మిల నాయకత్వంపై ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కె .సి .వేణుగోపాల్‌కి ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లు సుంకరపద్మశ్రీ, రాకేష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. తాజాగా జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థుల ఎన్నిక పారదర్శకంగా జరుగలేదని ఆరోపించారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల అనుచరగణం అభ్యర్థుల ఎంపికలో క్విడ్ ప్రోఖో మాదిరిగా వ్యవహరించారని విమర్శించారు. ఆమె పోకడల కారణంగా కాంగ్రెస్ పార్టీపై ఎన్నికల్లో తీవ్రప్రభావం పడిందని తెలిపారు. అభ్యర్థులకు కాంగ్రెస్ అధిష్ఠానం అందించిన నిధులు సైతం గోల్‌మాల్ అయ్యాయని ఆరోపణలు చేశారు. అధిష్ఠానం షర్మిలని ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా నియమించినప్పుడు పార్టీని బలోపేతం చేస్తారని చాలా నమ్మకం పెట్టుకున్నామని.. కానీ ఆమె సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఒంటెద్దు పోకడలకు పోయి పార్టీకి నష్టం చేకూర్చారని చెప్పారు. సమర్థులైన వారికి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో అవకాశం ఇవ్వలేదని అన్నారు.

Tags

Next Story