ఏపీలో ఏమాత్రం కట్టడి కాని కరోనా..

ఏపీలో ఏమాత్రం కట్టడి కాని కరోనా..
ఏపీలో కరోనా కేసులు ఏమాత్రం కట్టడి కావడం లేదు.. రెండ్రోజులుగా నమోదైన పాజిటివ్‌ కేసులతో వైరస్‌ తగ్గుముఖం పడుతోందని అనిపించినా, తాజాగా నమోదైన కేసులతో వ్యాప్తి స్థాయిలో ఉందో..

ఏపీలో కరోనా కేసులు ఏమాత్రం కట్టడి కావడం లేదు.. రెండ్రోజులుగా నమోదైన పాజిటివ్‌ కేసులతో వైరస్‌ తగ్గుముఖం పడుతోందని అనిపించినా, తాజాగా నమోదైన కేసులతో వ్యాప్తి స్థాయిలో ఉందో అర్థమవుతోంది.. 24 గంటల్లో 8 వేలా 846 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 5 లక్షలా 83 వేలా 925కి పెరిగింది. మరోవైపు కరోనా కారణంగా చికిత్స పొందుతూ 69 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 5 వేలా 41కి పెరిగింది.

గడిచిన 24 గంటల్లో ప్రకాశం జిల్లాలో అత్యధికంగా పది మంది మృతిచెందారు. చిత్తూరులో 9 మంది చనిపోయారు. అనంతపురంలో ఆరుగురు, తూర్పుగోదావరిలో ఆరుగురు, కృష్ణా జిల్లాలో ఆరుగురు మృతిచెందారు. కడప, విశాఖ జిల్లాలో ఐదుగురు చొప్పున చనిపోయారు. ఏపీలో ఇప్పటి వరకు 47 లక్షలా 31 వేలా 866 మందికి పరీక్షలు నిర్వహించిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొన్నారు.. ప్రస్తుతం రాష్ట్రంలో 92 వేల 353 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

కరోనా కట్టడిలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు.. విజయవాడలో కరోనాపై కాంగ్రెస కోవిడ్‌ కంట్రోల్‌ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకే రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశామని చెప్పారు. కరోనా నియంత్రణపై వైద్యరంగ నిష్ణాతులు మాట్లాడితే కేసులు పెడుతున్నారని ఏపీసీసీ చీఫ్‌ శైలజానాథ్‌ మండిపడ్డారు. కొవిడ్ సమస్యలపై సైంటిఫిక్‌గా మాట్లాడేవారితో ప్రభుత్వం చర్చించడం లేదన్నారు. కలెక్టర్లను, పోలీస్ అధికారులను కొవిడ్‌ నియంత్రణకు ఎలా వినియోగిస్తున్నారని ప్రశ్నించారు.

రోగి వచ్చిన అరగంటకే బెడ్ ఇస్తామని ముఖ్యమంత్రి చెప్తున్న మాటలకు వాస్తవ పరిస్థితులకు చాలా తేడా ఉందని డాక్టర్‌ గంగాధర్‌ అన్నారు. వారం రోజుల్లో మరోసారి సమావేశం నిర్వహించి కొవిడ్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. అన్ని పార్టీలు, ప్రజా సంఘాలను కలుపుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని డాక్టర్ గంగాధర్ చెప్పారు. మొత్తంగా ఏపీలో ప్రతిరోజూ పాజిటివ్ కేసులు వేలల్లో నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.. ఇప్పటికైనా ప్రభుత్వం వైరస్‌ కట్టడికి చర్యలు తీసుకోకుంటే దేశంలోనే మొదటిస్థానానికి చేరే ప్రమాదం ఉందని ప్రజలు భయపడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story