AP:రోజుకు రూ. 3.36 కోట్లు కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్లు

AP:రోజుకు రూ. 3.36 కోట్లు కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్లు
X
ఒక ఏడాదిలోనే రూ. 1,229 కోట్ల సొత్తును కొట్టేసిన సైబర్‌ నేరగాళ్లు

ఆంధ్రప్రదేశ్‌లో సైబర్‌ నేరాలు గణనీయంగా పెరిగాయి. ఒక ఏడాదిలోనే రూ. 1,229 కోట్ల సొత్తును సైబర్‌ నేరగాళ్లు కొల్లగొట్టారు. ఈ ఒక్క సంవత్సరంలో ఫోన్‌కాల్స్‌ ద్వారా పోలీసులకు ఏకంగా 7,23,378 ఫిర్యాదులందాయి. వాటన్నింటినీ పరిశీలించి 916 కేసులు నమోదు చేశారు. ఈ నేరాల్లో బాధితులు రూ.1,229 కోట్ల సొమ్ము పోగొట్టుకున్నారు. 2024లో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన నేరాలను డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. సగటున రోజుకు రూ. 3.36 కోట్లను సైబర్‌ నేరగాళ్లు డబ్బును దోచుకున్నారని వివరించారు.

రోజుకు 3.36 కోట్లు కొల్లగొట్టారు

ఏపీ ప్రజల నుంచి సైబర్‌ నేరగాళ్లు సగటున రోజుకు రూ.3.36 కోట్లు కొల్లగొట్టారని డీజీపీ తెలిపారు. 2023లో ఫోన్‌కాల్స్‌ ద్వారా 4,74,391 ఫిర్యాదులందగా, పోలీసులు 682 కేసులు పెట్టారు. మొత్తంగా బాధితులు రూ.173 కోట్లు నష్టపోయారు. 2023తో పోలిస్తే 2024లో వీటిపై ఫిర్యాదులు 52.4 శాతం, కేసులు 34.3 శాతం పెరగ్గా, బాధితులు కోల్పోయిన సొత్తు విలువ ఏకంగా 610 శాతం మేర పెరిగింది. డీజీపీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు 2024 సంవత్సరానికి సంబంధించిన వార్షిక నేర గణాంక నివేదికను డీజీపీ వెల్లడించారు.

గతేడాది 97,760 కేసులు

మొత్తంగా అన్ని రకాల నేరాలపై గతేడాది 97,760 కేసులు నమోదు కాగా ఈ సంవత్సరం 92,094కు పరిమితమైందన్నారు. ఈ ఏడాది హత్యలు, హత్యాయత్నం కేసులు తగ్గగా, లాభం కోసం హత్యలు, దోపిడీలు, పగలు, రాత్రి వేళల్లో ఇళ్లలో దొంగతనాలు ఎక్కువయ్యాయని తెలిపారు. మహిళల హత్యలు పెరుగగా అత్యాచారాలు, వరకట్న చావులు, మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఘటనలు గణనీయంగా తగ్గాయని వివరించారు. ఏపీలో గత ఏడాది 18,597 రోడ్డు ప్రమాదాల్లో 8,136 మంది చనిపోగా 20,977 మంది గాయపడ్డారని తెలిపారు. 2024లో 17,688 రోడ్డు ప్రమాదాల్లో 7,863 మంది చనిపోగా 19,711 మంది క్షతగాత్రులయ్యారని అన్నారు.

Tags

Next Story