AP: ఏపీ దిశగా దూసుకొస్తున్న రాకాసి తుఫాను

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడి మొంథా తుఫాన్‌గా మారినట్లు వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి-ఆగ్నేయ మధ్య బంగాళాఖాతంలో ఇది కేంద్రీకృతమై ఉంది. కోస్తా జిల్లాల్లో ‘మొంథా’ తుపాను తీవ్ర కలకలం రేపుతోంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఇప్పటికే ‘తుపాను’గా బలపడింది. సోమవారం సాయంత్రానికి చెన్నైకి 420 కిలోమీటర్లు, కాకినాడకు 450, విశాఖకు 500, గోపాల్‌పుర్ (ఒడిశా)కు 670 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమంగా ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ ఇవాళ ఉదయానికి తీవ్ర తుపానుగా బలపడే అవకాశముందని భారత వాతావరణ విభాగం పేర్కొంది. తర్వాత ఇవాళ సాయంత్రం లేదా రాత్రికి కాకినాడ సమీపంలో తీవ్ర తుపానుగా తీరం దాటుతుందని అంచనా వేస్తోంది. నేడు దాదాపు 18 గంటలు దీని తీవ్రత కొనసాగి, తర్వాత తుపానుగా బలహీనపడే అవకాశముంది. తీరం దాటే సమయంలో కోస్తా జిల్లాల్లో గంటకు గరిష్ఠంగా 110 కిలోమీటర్ల వేగంతో, మిగిలిన ప్రాంతాల్లో గంటకు 90 కి.మీ. వేగంతో ప్రచండ గాలులు వీయవచ్చని తెలిపింది. మొంథా తుపాను ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. కాకినాడలో ఈ ఉదయం చిరుజల్లులు పడగా.. ఉదయం 10 గంటల తర్వాత వర్షం తీవ్రత పెరిగింది. విశాఖలోని మధురవాడలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది.
మొదలైన ప్రభావం
తుపాను ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ఉదయం నుంచే మొదలైంది. కాకినాడ సహా పలు ప్రాంతాల్లో కొంతసేపు ఎండ కాయడంతో.. ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అంతలోనే చిరుజల్లులు మొదలయ్యాయి. విశాఖపట్నం, అనకాపల్లి, శ్రీకాకుళం, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఓ మోస్తరు వానలు కురిశాయి. విశాఖ రూరల్‌లో 94 మి.మీ. వర్షపాతం నమోదైంది. అనంతపురం జిల్లా ఉరవకొండలో 84 మి.మీ. వర్షపాతం నమోదైంది. పలు జిల్లాలకు ఆకస్మిక వరద ముప్పు పొంచి ఉందని ఐఎండీ హెచ్చరించింది. విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్ కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు, జిల్లాలకు ‘ప్లాష్ ఫ్లడ్’ అలర్ట్ జారీ చేసింది. సముద్రం అత్యంత అలజడిగా మారిన నేపథ్యంలో శుక్రవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది. ఇప్పటికే వేటకు వెళ్లినవారు తిరిగి ఒడ్డుకు చేరుకోవాలని పేర్కొంది. కాకినాడ, మచిలీపట్నం పోర్టులకు నాలుగో నంబరు ప్రమాద హెచ్చరిక, కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, నిజాంపట్నం, కృష్ణపట్నం, వాడరేవు పోర్టులకు మూడో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

