PAWAN: పిల్లలు శాస్త్రవేత్తలుగా ఎదగాలి

ఆంధ్రప్రదేశ్ యువతలో అపరిమితమైన జిజ్ఞాస ఉంది... దీన్ని సరైన రీతిలో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం వుందవి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. సరైన దారి చూపేవారు లేకపోవడం వలనే యువత ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారన్నారు. రాష్ట్ర యువతకు దారిచూసే బాధ్యత ఇస్రో తీసుకోవాలని పవన్ విజ్ఞప్తి చేశారు. యువతతో విజ్ఞానపరమైన విషయాలను పంచుకునేలా, విలువైన సూచనలు అందించేలా ఇస్రోతో ఎంఓయూకు ప్రయత్నిస్తానని పవన్ తెలిపారు. అంతరిక్ష రంగంలో మంచి అవకాశాలు వున్నాయి... కాబట్టి భావితరాలకు ఇటువైపు నడవాలని సూచించారు. అంతరిక్ష పరిశోదనలపై చిన్నప్పటినుండే ఆసక్తి ఏర్పర్చుకోవాలన్నారు. యువతకు అంతరిక్ష పరిశోధనలపై ఉన్న ఆకాంక్షకు తగినట్లుగా ఉపాధి మార్గం లేదంటే పరిశోధనల మార్గాన్ని ఇస్రో అధికారులు చూపాలన్నారు... తగిన గైడెన్స్ ఇస్తే యువత జీవితం మెరుగుపడటమే కాదు దేశానికి కూడా మంచి సేవలు అందుతాయన్నారు. గ్రామీణ, అర్భన్ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులను అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తిని పెంచేలా ప్రభుత్వం, ఇస్రో కలిసి ముందుకు వెళదాం... ఇందుకోసం ప్రత్యేకంగా ఓ ఎంఓయూ చేసుకుందామని పవన్ సూచించారు.
హాలీవుడ్‌లో గ్రావిటీ సినిమాకు పెట్టిన వ్యయం కంటే తక్కువ ఖర్చుతో భారత్ మార్స్ మిషన్ ‘మంగళ్‌యాన్’ను పూర్తి చేసిందని పవన్ కొనియాడారు. ప్రపంచంలో ఇంత తక్కువ ఖర్చుతో అంతరిక్ష పరిశోధనలు చేసిన దేశాలు లేవన్నారు. శ్రీహరికోటలోని షార్‌లో నిర్వహించిన జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 1969 నుంచి ఇంతింతై వటుడింతై అన్నట్లుగా సాగిన భారత అంతరిక్ష పరిశోధన ప్రయాణం నేడు ప్రపంచంలోనే మేటిగా మారిందని పవన్ అన్నారు. భారత్‌ను బలమైన శక్తిగా నిలపడంలో ఎందరో కనిపించని హీరోల కష్టం దాగుందన్నారు. విదేశాలకు వెళ్లి ధనం, హోదా సంపాదించే అవకాశం ఉన్నా వాళ్లంతా దేశానికి కట్టుబడి చేసిన సేవలు మరువలేమన్నారు.
తాను సామాన్యుడిని, ఏదో సినిమా హీరోనయ్యానని.. ఇక్కడ తనకు కొట్టే చప్పట్లు, ఈలలు శాస్త్రవేత్తలకే దక్కాలని పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. అనంతరం క్విజ్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందించారు. శ్రీహరికోటలోని మొదటి, రెండో ప్రయోగ వేదికలు, మిషన్ కంట్రోల్ సెంటర్‌ను ఆయన సందర్శించారు. పవన్‌కల్యాణ్‌కు షార్ సంచాలకులు రాజరాజన్ చంద్రయాన్-3 నమూనా అందజేసి సన్మానించారు. ఏడీ సయ్యద్ హమీద్, విజిలెన్స్ ఆఫీసర్ శ్రీనివాసులురెడ్డి, డీడీ రఘురాం, ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పాల్గొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com