PAWAN: 15 ఏళ్లు పొత్తు ధర్మం పాటిస్తాను: పవన్
టీడీపీతో జనసేన పొత్తుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 15 ఏళ్ల పాటు టీడీపీతో కలిసి పని చేయాలని అనుకుంటున్నానని పవన్ స్పష్టం చేశారు. తమ బంధం కచ్చితంగా 15 ఏళ్లు ఉంటుందని తెలిపారు. ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని, భయపడే వాడినైతే రాజకీయాల్లోకి వచ్చే వాడినే కాదన్నారు. అన్నిటికి తెగించే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చానని పవన్ కల్యాణ్ తెలిపారు. కూటమి విజయం అంటే ప్రజల విజయమని పవన్ అన్నారు. పిఠాపురంలో ఆయన మాట్లాడుతూ.. ‘సంక్రాంతిని అద్భుతంగా జరుపుకుందామని అనుకున్నాం. కానీ, తిరుపతి ఘటనతో చిన్నగా జరుపుకుంటున్నాం. దేశం, పల్లెల రుణం తీర్చుకోవాలనేది నా ఆశ. ప్రజలు ఇచ్చిన విజయంతో రాష్ట్రానికి రూ.2లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. గ్రామాల్లోని అధికారులు బాధ్యతగా పనిచేయాలి. వారికి మేము అండగా ఉంటాం’ అని అన్నారు.
రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది: పవన్
రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. పిఠాపురం మండలం కుమారపురంలో 12,500 మినీ గోకులం షెడ్లను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘భవిష్యత్తులో 20 వేల గోకులాలు ఏర్పాటు చేస్తాం. ఆవు బాగుంటేనే రైతు బాగుంటాడు.. రైతు బాగుంటే.. దేశం బాగుంటుంది. గత పాలకులు ప్రభుత్వ డైరీలను చంపేశారు. రంగులు వేయడానికే వేల కోట్లు ఖర్చు చేశారు’ అని పవన్ ఆరోపించారు.
మహిళల జోలికి వస్తే తాట తీస్తాం: పవన్
'అమ్మాయిలను ఏడిపించి మగతనం అనుకుంటే తొక్కి నార తీస్తాం. పిఠాపురంలో ఈవ్‌టీజింగ్ అనేది ఉండకూడదు. క్రిమినల్స్‌కి కులం ఉండదు.. తప్పు చేసి కులాల చాటున దాక్కుంటే ఈడ్చుకొస్తాం. మహిళల జోలికి వస్తే తాట తీస్తాం. సొంత నియోజకవర్గాన్ని కాపాడుకోకపోతే నాకు డిప్యూటీ సీఎం పదవి ఎందుకు?' అంటూ పవన్ వ్యాఖ్యానించారు.
ఫొటో ఎగ్జిబిషన్ తిలకించిన పవన్
పిఠాపురం మండలం కుమారపురం గ్రామంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఫొటో ఎగ్జిబిషన్ పరిశీలించి స్థానిక అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహాత్మా గాంధీ జాతి ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పనుల వివరాలు పవన్ కళ్యాణ్ తెలుసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com