PAWAN: ఇక సనాతన ధర్మం కోసం వారాహి దీక్ష

PAWAN: ఇక సనాతన ధర్మం కోసం వారాహి దీక్ష
X
ప్రాయశ్చిత్త దీక్ష విరమించిన పవన్ కల్యాణ్... వారాహి చాలా పెద్ద లక్ష్యం కోసం తిరిగి వచ్చిందన్న డిప్యూటీ సీఎం

జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రాయశ్చిత్త దీక్షను విరమించారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం నేపథ్యంలో 11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన పవన్.. అలిపిరి నడకమార్గంలో తిరుమల చేరుకున్నారు. ఇద్దరు కుమార్తెలు ఆద్య, పొలెనా అంజనాతో శ్రీవారి ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్నారు. వీఐపీ బ్రేక్‌ సమయంలో కుమార్తెలు ఆద్య, పొలెనా అంజనతో కలిసి మహాద్వారం గుండా ఆలయంలోకి వెళ్లారు. వైకుంఠం క్యూలైన్‌ ద్వారా దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనంద్‌సాయి వచ్చే వరకు రంగనాయక మండపం వద్ద ఆయన వేచి ఉన్నారు. ఆ తర్వాత వారితో కలిసి ధ్వజస్తంభానికి మొక్కుకుని బంగారువాకిలికి చేరుకున్నారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరి వారికి స్వాగతం పలికారు. అనంతరం ధ్వజస్తంభానికి మొక్కిన పవన్‌కల్యాణ్‌.. బంగారు వాకిలి నుంచి శ్రీవారి ఆలయంలోకి వెళ్లారు. అక్కడ శ్రీవారిని దర్శించుకుని వారాహి డిక్లరేషన్‌ పుస్తకాన్ని స్వామివారి పాదాల వద్ద ఉంచారు. ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు స్వామివారి పంచబేరాలు, శ్రీవారి మూలవిరాట్టు విశిష్టతను పవన్‌కల్యాణ్‌కు వివరించారు. దర్శనం అనంతరం నేరుగా రంగనాయకుల మండపానికి వెళ్లారు. అక్కడ వేద పండితులు డిప్యూటీ సీఎంకు వేద ఆశీర్వచనం అందించారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపలికి వచ్చాక శ్రీవెంగమాంబ అన్నదాన సత్రానికి వెళ్లి పవన్‌కల్యాణ్‌ అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అన్నప్రసాదం తయారీ విధానాన్ని అదనపు ఈవో వివరించారు. అనంతరం శ్రీవారి సేవకుల వద్దకు పవన్‌ వెళ్లి వందనం చేశారు. ఆపై నేరుగా అతిథిగృహానికి వెళ్లారు.


మళ్లీ పెద్ద లక్ష్యంతో వారాహి

భక్తులకు అన్నప్రసాదాలు వడ్డిస్తున్న తీరును పరిశీలించారు. భక్తులతో కలిసి అన్నప్రసాదాలు స్వీకరించారు. అన్నప్రసాదాల తయారీ, రోజు ఎంతమంది వస్తున్నారు, ఇటీవల చేపట్టిన మార్పులను టీటీడీ ఉన్నతాధికారులు పవన్‌కు వివరించారు. శ్రీవారి సేవకులకు, భక్తులకు పవన్‌ నమస్కరిస్తూ ఆప్యాయంగా పలకరించారు. తిరిగి అతిథి గృహానికి చేరుకున్న ఆయన చాలా వరకు ఏకాంతంగానే గడిపారు.ఇవాళ ఉదయం జపాలి ఆంజనేయస్వామిని దర్శించుకోనున్నారు.సనాతన ధర్మ పరిరక్షణ కోసమే వారాహి యాత్ర చేపడుతున్నట్టు పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. సుమారు 14 నెలల క్రితం వారాహి మొదటిసారి రోడ్డుపైకి వచ్చినపుడు అది కేవలం ఉద్యమం మాత్రమే కాదు దానికంటే మించిన కార్యక్రమం. కార్యాచరణకు పిలుపు. వైసీపీ నిరంకుశ పాలనలో ఏపీ నలిగిపోతున్న ఆ సమయంలో వారాహి శక్తికి సంకేతంగా మారిందని పవన్ ట్వీట్ చేశారు. ఇపుడు వారాహి చాలా పెద్ద లక్ష్యం కోసం తిరిగి వచ్చిందని.. సనాతన ధర్మ రక్ష బోర్డుకు జీవం పోయాలనుకునే లక్షలాది మంది స్వరాన్ని ప్రతిధ్వనించడమే దాని లక్ష్యమని అన్నారు. మన ప్రాచీన సాంప్రదాయాలు, విలువలను పరిరక్షించడానికి సంబంధించిందని...నేటి వారాహి సభ ఈ నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. కలసికట్టుగా దేశ భవిష్యత్తును సురక్షితం చేయడంతో పాటు బలోపేతం చేయగలమని పవన్‌ పోస్టు చేశారు.

డిక్లరేషన్‌పై సంతకం


శ్రీవారి దర్శనానికి వెళ్లే ముందు పవన్‌ తన కుమార్తె పొలెనా అంజనాతో డిక్లరేషన్‌ ఫారంపై సంతకం చేయించారు. సాధారణంగా శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే అన్యమతస్థులు తప్పనిసరిగా తమకు శ్రీవారిపై భక్తివిశ్వాసాలు ఉన్నాయని, దర్శనానికి అనుమతించాలని డిక్లరేషన్‌ ఫారంపై సంతకం చేస్తారు. పవన్‌కల్యాణ్‌ చిన్న కుమార్తె పొలెనా అంజనా అన్యమతస్థురాలు కావడంతో టీటీడీ అధికారులు ఆమె నుంచి డిక్లరేషన్‌ తీసుకున్నారు. తిరుమలలో డిప్యూటీ సీఎం విడిది చేసిన గాయత్రి నిలయం వద్దకు వెళ్లి సంతకాలు తీసుకున్నారు. ఆయన కుమార్తె మైనర్‌ కావడంతో పవన్‌కల్యాణ్‌ సాక్షి సంతకం చేశారు. ఆమెతోపాటు మరో ముగ్గురు అన్యమతస్థులూ శ్రీవారి దర్శనానికి వారి వెంట రావడంతో వారూ డిక్లరేషన్‌పై సంతకాలు చేశారు.

Tags

Next Story