PAWAN: ఏటికొప్పాక, కొండపల్లి కళాకారులకు పవన్ శుభవార్త

PAWAN: ఏటికొప్పాక, కొండపల్లి కళాకారులకు పవన్ శుభవార్త
X
అంకుడు, తెల్ల పొనికి చెట్లను పెంచాలన్న పవన్ కళ్యాణ్... పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు ఆదేశం

ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు రూపొందించే కళాకారులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభవార్తను అందించారు. ఏటికొప్పాక బొమ్మల తయారీకి ముడిసరకు అంకుడు కర్ర, కొండపల్లి బొమ్మలకు అవసరమయ్యే తెల్ల పొణికి చెట్లను విస్తారంగా పెంచాలని అధికారులను ఆదేశించారు. బొమ్మల తయారీదారులకు అవసరమయ్యే కర్ర లభ్యత కష్టంగా మారిందని, చెట్ల సంఖ్య క్రమంగా తగ్గుతోందని తన దృష్టికి రావడంతో అధికారులకు పవన్ దిశానిర్దేశం చేశారు. ఏటికొప్పాక, కొండపల్లి కళాకారులకు అందుబాటులో ఉండేలా అంకుడు, తెల్ల పొనికి చెట్లు పెంచడానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఇదే సమయంలో ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా ఈ చెట్లు పెంచాలని పవన్ కళ్యాణ్ సూచించారు. అటవీ ప్రాంతాలతో పాటుగా ఏటికొప్పాక, కొండపల్లి పరిసరాల్లో ఉన్న ప్రభుత్వ, అటవీ, సామాజిక స్థలాల్లో అంకుడు, తెల్ల పొనికి చెట్లు పెంచడంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కనీసం రెండు మూడు తరాలకు సరిపడా చెట్లను పెంచేలా అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. మరోవైపు ఏపీలో హస్తకళలను ప్రోత్సహించేందుకు ఇప్పటికే పవన్ కళ్యాణ్ అనేక చర్యలు తీసుకున్నారు. అతిథులకు అందించే బహుమతులుగా కూడా ఈ కళాకృతులనే అందిస్తున్నారు.


చాలా కారణాలున్నాయ్‌..

ఉపాధి హామీ పనుల్లో భాగంగా అంకుడు, తెల్ల పొనికి మొక్కలను పెద్దమొత్తంలో నాటించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. అంకుడు మొక్కలను అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో నాటించాలని నిర్ణయించారు. తెల్ల పొనికి మొక్కల పెంపకానికి ఎన్టీఆర్ జిల్లా అనువైన ప్రాంతంగా నిర్ణయించారు. ప్రత్యేకంగా ఈ రెండు మొక్కల పెంపకంపైనే దృష్టిసారించటానికి కారణాలు ఉన్నాయి. అంకుడు మొక్కలు చెట్లుగా మారిన తర్వాత వాటి కలపతో అనేక ఉపయోగాలు ఉంటాయి. చాలా మృదువుగా ఉండే అంకుడు కలపతోనే ప్రపంచ ప్రఖ్యాత ఏటికొప్పాక బొమ్మలను తయారు చేస్తారు. అంకుడు చెట్ల పువ్వులు, కాయలు, విత్తనాలు, ఆకులతో పశువుల దాణాను తయారు చేస్తారు. రంగుల తయారీలోనూ అంకుడును విరివిగా వినియోగిస్తారు. చింతపల్లి, పాడేరు, కంబాలపల్లి, అరకు, నర్సీపట్నం, రాజవొమ్మంగి, అడ్డతీగల ప్రాంతాల్లో అంకుడు మొక్కల పెంపకానికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. చాలా తేలిగ్గా వంగిపోయే, మృదువుగా ఉండే ఈ కలపతో ఏటికొప్పాక బొమ్మలను అందంగా తీర్చిదిద్దుతారు. ఆ కళను కాపాడేందుకు వారికి విరివిగా కలప అందుబాటులో ఉంచేందుకు ఈ అంకుడు మొక్కలను అల్లూరి సీతారామాజు, అనకాపల్లి జిల్లాల్లోని కమ్యూనిటీ క్లస్టర్లలో ఈ మొక్కలను ఉపాధి పనుల్లో భాగంగా నాటించాలని గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ వీ.ఆర్.కృష్ణతేజ మైలవరపు ఈ రెండు జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

పచ్చదనం కూడా..

అటు పచ్చదనం ఇటు ఉపాధి మరో వైపు బొమ్మల తయారీదారులకు చేయూత మరో వైపు కృష్ణాజిల్లాలో తెల్లపొనికి/తెల్ల పొలికి చెట్ల పెంపకానికి ఆదేశాలను జారీచేశారు. అచ్చం అంకుడు కలపలానే తేలిగ్గా వంగుతూ, మృదువుగా, తక్కువ బరువుతో ఉండే తెల్లపొనికి కలపతోనే ప్రఖ్యాత కొండపల్లి బొమ్మలను తయారు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృతిలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న కొండపల్లి బొమ్మలు వాటి తయారీ కళ అంతర్థానం కాకుండా ఉండేలా బొమ్మల తయారీదారులకు ఆసరాగా ఉండేలా ఎన్టీఆర్ జిల్లాలో తెల్లపొనికి చెట్లను కమ్యూనిటీ క్లస్టర్లలో నాటించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

Tags

Next Story