PAWAN: పోలీసులకు పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
![PAWAN: పోలీసులకు పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు PAWAN: పోలీసులకు పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు](https://www.tv5news.in/h-upload/2024/11/23/1409107-17.webp)
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఏన్డీఏ కూటమి ప్రభుత్వ పరిపాలన నాలుగు దశాబ్దాల నాటి ఫ్రేమ్‌వర్క్‌ను సమగ్రంగా మార్చేలా ఉంటుందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ (నిషేధం) చట్టాన్ని తెచ్చామని వెల్లిడించారు. ఈ కొత్త చట్టంలో కఠినమైన జరిమానాలు, బాధితులకు పరిహారం, ప్రభుత్వ భూముల రక్షణ, ప్రత్యేక కోర్టుల ఏర్పాటు, నివారణ చర్యలు, మెరుగైన భూ రికార్డులు, టైటిల్ వెరిఫికేషన్, సమర్థవంతమైన ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియ ఉంటాయని అన్నారు రెవెన్యూ, పంచాయతీ, దేవాదాయ శాఖల పరిధిలోని ప్రభుత్వ భూముల ఆక్రమణలతోపాటు బలవంతపు భూసేకరణ ఘటనలపై తనకు చాలా ఫిర్యాదులు అందుతున్నాయని.. బాధితులు, సంబంధిత శాఖల నుంచి ఇలాంటి ఫిర్యాదులు అందిన వెంటనే పోలీసు శాఖ వెంటనే చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. తనకు వచ్చిన ఫిర్యాదుల్లో గణనీయమైన సంఖ్యలో కాకినాడతో పాటు ఏపీలోని ఇతర ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వచ్చాయని అన్నారు.
కలెక్టర్లూ.. కదలండి
బలవంతపు భూసేకరణ ఘటనలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, కాకినాడ పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నివేదికలను ప్రాధాన్యం ఇచ్చి కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌లు, ఎస్పీలను కోరారు. వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను అస్తవ్యస్తం చేసినట్లుగానే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కూడా భ్రష్టు పట్టించిందని పవన్ ఆరోపించారు. ఇటీవల సమీక్షలు నిర్వహించినప్పుడు ఈ పథకం అమల్లో అనేక అవకతవకలు బయటకు వచ్చాయని, వాటిపై లోతుగా విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి 100 రోజుల ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు. కొత్తగా పేర్లు నమోదు చేసుకున్నవారికి 15 రోజుల్లోపు జాబ్ కార్డులు అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.4,500 కోట్లతో 30 వేల అభివృద్ధి పనులు చేసి 7 కోట్ల పని దినాలు కల్పించామని తెలిపారు. ‘పల్లె పండుగ’ కార్యక్రమంలో 3 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, 500 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 20 వేల మినీ గోకులం షెడ్లు, అవసరమైనచోట్ల వాటర్ హార్వెస్టింగ్ పనులు చేపట్టామని, వచ్చే సంక్రాంతిలోపు ఈ పనులన్నీ పూర్తి చేయాలనే బలమైన సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు.
పారిశ్రామిక అభివృద్ధి సాధించాలి...
పర్యావరణాన్ని పరిరక్షించుకొంటూనే పారిశ్రామిక అభివృద్ధి సాధించాలని పవన్ సూచించారు. తీరం వెంబడి ఉన్న పరిశ్రమలు వ్యర్థాలను శుద్ధి చేసి, నిర్దేశిత ప్రాంతంలోనే వాటిని వదిలేలా చూస్తామన్నారు. తద్వారా మత్స్య సంపదకు నష్టం కలగకుండా చర్యలు చేపడతామన్నారు. 25 నుంచి జరగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై జనసేన ఎంపీలకు పవన్ సూచనలు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com