PAWAN: ఫలితాలు సాధించారా.. అధికారులకు పవన్‌ సూటి ప్రశ్నలు

PAWAN: ఫలితాలు సాధించారా.. అధికారులకు పవన్‌ సూటి ప్రశ్నలు
X
ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులతో పవన్‌ కల్యాణ్‌ సమీక్ష... 4 వేల కోట్లతో చేపట్టిన పనులను సమగ్రంగా పరిశీలన చేయాలని ఆదేశం

ఆంధ్రప్రదేశ్‌లో జల్‌జీవన్‌ మిషన్‌ నిధులను ఏవిధంగా ఖర్చు చేశారో సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని గ్రామీణ రక్షిత నీటి సరఫరా అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆదేశించారు. ఈ పథకానికి సంబంధించి ఇప్పటివరకు వ్యయమైన రూ. 4 వేల కోట్లతో చేపట్టిన పనులను సమగ్రంగా పరిశీలన చేయాలన్నారు. జిల్లా నుంచి గ్రామ స్థాయి వరకు.. నీటి సరఫరా ప్లాంట్‌ నుంచి ఇంటి కుళాయి వరకు ప్రతి దశలో నిపుణులతో తనిఖీలు చేయించాలని పేర్కొన్నారు. తన నివాసంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులతో పవన్‌ కల్యాణ్‌ సమీక్షించారు. జల్‌జీవన్‌ మిషన్‌ పథకానికి రూ. 4 వేల కోట్ల వరకు ఖర్చు చేసినట్లు చూపిస్తున్నారని, ఆ స్థాయిలో ఫలితాలు సాధించారా.. అని అధికారులను ప్రశ్నించారు. నీటి సరఫరా ప్లాంట్ల నిర్మాణం, పైపులైన్లు, ఇంటింటికీ కుళాయిల పనుల్లో జల్‌జీవన్‌ మిషన్‌ నిర్దేశించిన డిజైన్లు, సాంకేతిక అంశాలను సరిచూడాలని నిర్దేశించారు. పురోగతిలో ఉన్న జల్‌జీవన్‌ మిషన్‌ పనుల్లో ఆంధ్రప్రదేశ్‌ 29వ స్థానంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లడంతో పాటు నాణ్యతా ప్రమాణాల ప్రకారం పైపులు వేస్తున్నారో లేదో పరిశీలించాలని పవన్‌కల్యాణ్‌ స్పష్టం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పురోగతి కనిపించాలని, వంద శాతం పనులు పూర్తిచేసిన రాష్ట్రాల జాబితాలో ఏపీ ఉండాలని చెప్పారు. ఈ పథకం ద్వారా రాష్ట్రానికి రూ. 27 వేల కోట్ల మేర పనులు చేపట్టే అవకాశం ఉందని, గత వైసీపీ ప్రభుత్వం మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇవ్వకపోవడంతో కేంద్రం ఆ స్థాయిలో నిధులు కేటాయించలేదని తెలిపారు. నిధులొచ్చే అవకాశం ఉన్నా.. వాటిని వినియోగించుకోలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? విడుదలైన వాటినైనా సద్వినియోగం చేశారా.. అనే అంశాలపై మరోసారి సమీక్ష చేస్తానని వెల్లడించారు.

మండలానికో భూ కబ్జా

వై.ఎస్‌. జగన్‌ పాలనలో మండలానికో భూ కుంభకోణం జరిగిందని.. వైసీపీ నేతలు, కొందరు అధికారులు కుమ్మక్కై పెద్దఎత్తున భూకబ్జాలు, ఆక్రమణలకు పాల్పడ్డారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఘాటు విమర్శలు చేశారు. రికార్డుల్ని తారుమారు చేయడం, ఆన్‌లైన్లో పేర్లు మార్చేయడం వంటివి యథేచ్ఛగా చేశారని మండిపడ్డారు. గ్రీవెన్స్‌లో 90 శాతం ఈ తరహా సమస్యలే వస్తున్నాయని గుర్తుచేశారు. వీటిపై సమగ్ర విచారణ చేసి బాధ్యుల్ని శిక్షిస్తే.. అందరూ దారిలోకి వస్తారని స్పష్టం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన చంద్రబాబు.. విలేకరులతో ఇష్టాగోష్ఠిగా ముచ్చటించారు. రాబోయే వంద రోజుల్లో దెబ్బతిన్న వ్యవస్థల్ని గాడిలో పెడతామని ధీమా వ్యక్తం చేశారు.

Tags

Next Story