RRR: అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏ ఎమ్మెల్యే అయినా సెలవు అడగకుండా 60 రోజుల పాటు అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు పడుతుందని రఘురామ అన్నారు. ముందుగా స్పీకర్ అనుమతి తీసుకుని గైర్హాజరు కావొచ్చని అన్నారు. ఎలాంటి అనుమతి లేకుండా సమాచారం లేకుండా మాత్రం అసెంబ్లీకి వెళ్లకపోతే సభ్యులపై అనర్హతా వేటు వేయవచ్చునని ఆయన ప్రకటించారు. జగన్ అసెంబ్లీకి రాకపోయినా అతనిపై అనర్హత వేటుతో పాటు, పులివెందులకు ఉప ఎన్నికవస్తుందన్నారు. జగన్ అసెంబ్లీకి వచ్చి తన మనోభావాలను చెప్పుకోవాలని సూచించారు.
జగన్ అసెంబ్లీకి హాజరవుతారంటున్న వైసీపీ
వైఎస్ జగన్ లండన్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తరవాత జగన్ తన వ్యూహం మార్చుకున్నారని అసెంబ్లీకి హాజరయ్యే అవకాశం ఉందని వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. ఆయన రావాలని తన వాదన వినిపించుకోవాలని రఘురామ అంటున్నారు. వైఎస్ జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి మాత్రమే అసెంబ్లీకి వెళ్లారు. ఆ తర్వాత వెళ్లలేదు. ఆయన పార్టీ ఎమ్మెల్యేలను పంపడం లేదు. దాంతో అసెంబ్లీకి వెళ్లని ఎమ్మెల్యేలుగా వారు విమర్శలు ఎదుర్కొంటున్నారు. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా వేధిస్తున్నారని జగన్ అంటున్నారు.
అందరిపై వేటు తప్పదా..?
ప్రతిపక్ష హోదా ఇచ్చే వరకూ అసెంబ్లీకి కి వచ్చేది లేదని జగన్ ప్రకటించారు. హోదా ఇవ్వకపోవడం అధికార కూటమి తప్పని తనను అవమానిస్తున్నారని..అంటున్నారు. ఇప్పుడు అనర్హతా వేటు భయంతో అసెంబ్లీకి వెళ్తే ఎగతాళి చేస్తారని.. అనర్హతా వేటు వేసినా సరే అసెంబ్లీకి వెళ్లేది లేదని ఆయన పట్టుబట్టే అవకాశం ఉందంటున్నారు. అసెంబ్లీకి వెళ్లడం లేదని అందరిపై అనర్హతావేటు వేస్తే అదో దేశవ్యాప్త చర్చ అవుతుందని అలాంటిది జరగాలని ఆయన కోరుకుంటారని అంటున్నారు.
ముగిసిన జగన్ లండన్ పర్యటన
జగన్ లండన్ పర్యటన ముగిసింది. తరువాత బెంగళూరు చేరుకున్న ఆయన.. సోమవారం సాయంత్రం గన్నవరం ఎయిర్ పోర్ట్ చేరుకున్నారు. ఈ సందర్భంగా జగన్‌కు వైసీపీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. సీఎం జగన్.. సీఎం జగన్ అంటూ అభిమానులు కేకలతో ఎయిర్ పోర్టు ప్రతిధ్వనించింది. జగన్‌తో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com