DGP: మదనపల్లె అగ్ని ప్రమాదం.. కుట్ర కోణమే !

అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం.. కుట్ర కారణంగా జరిగినట్లు అన్పిస్తోందని డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన ఆయన పోలీసు అధికారులతో రెండు గంటల పాటు చర్చించారు. ప్రాథమిక విచారణ నివేదికను పరిశీలించాక డీజీపీ మీడియాతో మాట్లాడారు. ఆదివారం రాత్రి 11.30 గంటలకు అగ్ని ప్రమాదం జరిగిందన్న డీజీపీ... అన్ని కోణాల్లో పరిశీలించాక అది యాక్సిడెంట్ కాదు, ఇన్సిడెంట్‌గా భావిస్తున్నామని తెలిపారు.
22ఏ భూముల దస్త్రాలతో పాటు పలు కీలక పత్రాలున్న గదిలోనే అగ్ని ప్రమాదం జరిగింది. ఇది అనుమానాలకు తావిస్తోందని వివరించారు. ఘటన సమాచారం ఆర్డీవో హరిప్రసాద్‌కు తెలిసినా కలెక్టర్‌కు, ఎస్పీకి సమాచారమివ్వలేదని... ఘటన గురించి తెలుసుకున్న సీఐ కూడా ఎస్పీ, డీఎస్పీలకు సమాచారం ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోందని డీజీపీ వెల్లడించారు. రెవెన్యూ, పోలీసు అధికారుల అలసత్వం కనిపిస్తోందని.... కార్యాలయంలో షార్ట్ సర్య్కూట్ జరిగేందుకు అవకాశమే లేదని ఎస్పీడీసీఎల్ అధికారులు నివేదిక ఇచ్చారని వెల్లడించారు. అక్కడ వోల్టేజీ తేడాలకు అవకాశమే లేదని తేలిందన్నారు. ఫోరెన్సిక్ నిపుణులూ ఇదే విషయం చెబుతున్నారని డీజీపీ వివరించారు. సబ్ కలెక్టర్ కార్యాలయం కిటికీ బయట అగ్గిపుల్లలు కనిపించాయన్న డీజీపీ.... కార్యాలయం బయట కూడా కొన్ని ఫైళ్లు కాలిపోయాయన్నారు. ఇవన్నీ అనుమానాలను పెంచుతున్నాయని డీజీపీ వివరించారు.
అధికారుల నివేదిక
మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం కాదని అధికారులు తేల్చారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని నిపుణుల బృందం పరిశీలించి, నివేదిక ఇచ్చింది. మదనపల్లి సబ్‌కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని 33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నుంచే కార్యాలయానికి, కలెక్టర్, సబ్ కలెక్టర్ బంగ్లాలకు విద్యుత్ సరఫరా జరుగుతుందని తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో సబ్‌కలెక్టర్ కార్యాలయం నుంచి మంటలు వస్తుండటాన్ని 100 మీటర్ల దూరంలోనే ఉన్న సబ్‌స్టేషన్‌లోని సిబ్బంది గుర్తించారని.... వెంటనే సరఫరా నిలిపేశారని అన్నారు. సబ్‌స్టేషన్‌లో 20 కిలోవోల్టుల సామర్థ్యమున్న ట్రాన్స్‌ఫార్మర్ ఉండటంతో ఓవర్‌లోడ్ అయ్యే అవకాశం కూడా లేదని నివేదికలో పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com