AP: డబుల్ ఇంజిన్ సర్కార్.. డబుల్ డిజిట్ గ్రోత్

స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 అధికారులకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తెలుగువాళ్లను అగ్రస్థానంలో ఉంచాలన్నదే తన లక్ష్యమని వెల్లడించారు. ఏపీ సచివాలయంలో కలెక్టర్ల సదస్సు జరిగింది. ఇందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కొత్తగా వచ్చిన కలెక్టర్లకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. అంతేకాకుండా పాత కలెక్టర్లు కూడా పనితీరు మెరుగుపరుచుకోవాలని చెప్పారు. అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూనే.. సంక్షేమ కార్యక్రమాలు కూడా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
పాలనలో బాధ్యతగా పని చేయండి
వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌరసేవలు అందిస్తున్నామని చంద్రబాబు గుర్తు చేశారు. సదస్సులో అధికారులకు సీఎం పలు అంశాలపై మార్గనిర్దేశం చేశారు. పాలనలో మొదటి ఏడాది పరీక్షలు పూర్తి అయిపోయాయని చెప్పుకొచ్చారు. ఇంకా బాధ్యతగా పనిచేయాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయకపోతే ఫలితాలు రావని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సాంకేతికత పెరిగిన దృష్ట్యా స్మార్ట్ వర్క్ చేయాల్సిందేనని ఆదేశించారు. ఏఐ, డేటా లేక్ వంటి వాటి ద్వారా సమన్వయం చేసుకుంటూ వెళ్లాలని సూచించారు. పథకాలు, కార్యక్రమాల అమలు కోసం ఆర్టీజీఎస్ సేవలను ఉపయోగించుకోవాలని మార్గనిర్దేశం చేశారు. విజన్ రూపొందించి దానికి నిధులు కేటాయించకపోతే ఇబ్బందులు వస్తాయని చెప్పుకొచ్చారు. సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచి సంక్షేమం అమలు చేస్తామని చెప్పామని.. అదే విధంగా సూపర్ సిక్స్‌ను సక్సెస్ చేశామని ఉద్ఘాటించారు. దేశంలోనే అతిపెద్ద సంక్షేమ పథకంలో భాగంగా 64 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్ ఇస్తున్నామని పేర్కొన్నారు. భారత ఆర్ధిక వ్యవస్థ 11వ స్థానం నుంచి 4 స్థానానికి చేరుకుందని, మరో 22 ఏళ్లలో స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తయ్యే సమయానికి భారత్ కూడా అగ్రస్థానానికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వృద్ధిరేటు 10.5 శాతం ఉందన్నారు. ఈ ఏడాది తలసరి ఆదాయాన్ని 3.47 లక్షలకు తీసుకెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. 2029 నాటికి 29 లక్షల జీఎస్డీపీ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. అప్పటికి 4.67 లక్షల తలసరి ఆదాయం లక్ష్యంగా మనం పని చేయాలని సూచించారు.
స్మార్ట్ వర్క్ చేస్తేనే మంచిది
పాలసీ ఇవ్వడం కాదు.. అమలు చేయడం కూడా ముఖ్యమేనని చంద్రబాబు స్పష్టం చేశారు.పేదరిక నిర్మూలన లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. జిల్లాల రూపు రేఖలు మార్చే ఛాన్స్ కలెక్టర్లకు ఉందని సీఎం గుర్తు చేశారు. ప్రస్తుతం స్మార్ట్ వర్క్ చేస్తేనే మంచిదన్నారు. భారత్‌ను మెుదటిస్థానంలో నిలపాలని చెప్పారు. మోదీ ప్రధాని అయ్యాక 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం.. ప్రస్తుతం నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారైందన్నారు. 'స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తయ్యేసరికి మన దేశం అగ్రస్థానం చేరుకుంటుంది. 1991కి ముందు సంస్కరణలు రాలేదు. అప్పుడు ఆర్థిక వృద్ధి రెండు లేదా మూడు శాతం ఉండేది. అప్పుడు వృద్ధి రేటు గురించి మాట్లాడినా.. టెక్నాలజీపై మాట్లాడినా హేళన చేసేవారు. అప్పుడు సంస్కరణలు వద్దన్న రాజకీయ పార్టీల మనుగడ ఇప్పుడు లేకుండా పోయింది.' అని చంద్రబాబు అన్నారు.
పనితీరు బాగుంటేనే కొనసాగింపు..
“కార్యాలయాల్లో కూర్చుని కాగితాలు చూస్తే అంతా సవ్యంగానే కనిపిస్తుంది. కానీ క్షేత్రస్థాయి వాస్తవాలు వేరుగా ఉంటాయి. అధికారులు మానవతా దృక్పథంతో ఆలోచించి, క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులను గ్రహించాలి,” అని చంద్రబాబు కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పథకాల ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరాలంటే క్షేత్రస్థాయి అనుభవమే కీలకమని ఆయన నొక్కి చెప్పారు. పాలనలో ప్రధాని, ముఖ్యమంత్రి తర్వాత జిల్లా స్థాయిలో కలెక్టర్లే అత్యంత కీలకమైన వ్యక్తులని చంద్రబాబు అభివర్ణించారు. “ఒక జిల్లా రూపురేఖలను మార్చే ప్రధాన బాధ్యత కలెక్టర్లదే. ప్రభుత్వం రూపొందించిన విధానాలను క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు చేయాల్సింది మీరే. అందుకే సరైన వ్యక్తి సరైన చోట ఉండాలనే లక్ష్యంతోనే సీఎస్, డీజీపీల నుంచి క్షేత్రస్థాయి అధికారుల వరకు నియామకాలు చేపట్టాం. ఎమ్మెల్యేల ఎంపిక, మంత్రివర్గ కూర్పులో ఎలాంటి నిశిత పరిశీలన చేశామో, అదే తరహాలో సమర్థులైన వారిని కలెక్టర్లుగా నియమించాం. మీరంతా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా పనిచేయాలి,” అని ఆయన ఆకాంక్షించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com