AP: వచ్చేసింది మెగా డీఎస్సీ

AP: వచ్చేసింది మెగా డీఎస్సీ
X
16 వేల పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చిన ఏపీ సర్కార్‌... నిరుద్యోగులకు చంద్రబాబు పుట్టినరోజు కానుక

నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేసింది. 2024 ఎన్నికల సమయంలో ఇచ్చిన మెగా డీఎస్సీ హామీ అమలు దిశగా ఏపీ రాష్ట్ర సర్కార్‌‌ ముందడుగు వేసింది. తన పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు నిరుద్యోగులకు గిఫ్ట్ ఇచ్చారు. స్పోర్ట్స్‌ కోటా, ఎస్సీ వర్గీకరణ, గత సర్కారులో అప్లై చేసిన అభ్యర్ధులకు కూడా వెసులుబాటు అందేలా నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో భాగంగా మరో కీలక అడుగు వేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినం సందర్భంగా, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శనివారం ఏపీ మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్‌ను అధికారికంగా విడుదల చేశారు.

ఈ వెబ్‌సైట్లలో అప్లై చేసుకోండి..

ఈ మేరకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. ఇది మేనిఫెస్టోలో పొందుపరిచిన ముఖ్యమైన హామీలను నెరవేర్చే దిశగా తీసుకున్న తొలి చర్యగా పేర్కొంది. https://cse.ap.gov.in లేదా https://apdsc.apcfss.in వెబ్‌సైట్ల ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయాన్ని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.

వారు ఫీజు చెల్లించొద్దు..

గతేడాది ఫిబ్రవరిలో ఎన్నికల ముందు వైసీపీ సర్కారు6100 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఆ సమయంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ప్రస్తుతం ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ, కొత్తగా దరఖాస్తు ఫారాన్ని పూర్తి వివరాలతో నింపి సబ్మిట్ చేయాలి. అభ్యర్థి గతంలో దరఖాస్తు చేసిన దానికన్నా ఎక్కువ సబ్జెక్టులకు లేదా పోస్టులకు దరఖాస్తు చేయాలనుకుంటే ఆ పోస్టులకు మాత్రమే ఒక్కో పోస్టుకు రూ.750 చొప్పున అదనంగా ఫీజు చెల్లించాలి.

వయో పరిమితి ఎంత?

2024 జులై 1 నాటికి డీఎస్సీ అప్లై చేసే అభ్యర్ధి వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థుల గరిష్ఠ వయస్సు 49 ఏళ్లు. దివ్యాంగుల గరిష్ఠ వయస్సు 54 ఏళ్లుగా నిర్ణయించారు. ఎక్స్ సర్వీస్‌మెన్‌ విభాగంలో నిబంధనలు అనుసరించి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

Tags

Next Story