ఏపీలో పంచాయతీ ఎన్నికలు.. కోర్టు తీర్పుతో అమల్లోకి వచ్చిన కోడ్ ఆఫ్ కండక్ట్
డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుతో పంచాయతీ ఎన్నికలకు అడ్డంకులు తొలగిపోయాయి. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్లొచ్చని డివిజన్ బెంచ్ చెప్పడంతో.. ఎస్‌ఈసీ రెడీ అవుతోంది. ఇప్పటికే జారీచేసిన నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికలకు వెళ్తామని ఎస్‌ఈసీ తెలిపింది. ఇప్పటికే మొత్తం నాలుగు విడతల్లో ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చింది ఎస్ఈసీ.
ఫిబ్రవరి 5, 9, 13. 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎస్‌ఈసీ తెలిపింది. కోర్టు తీర్పుతో కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా అమల్లోకి వచ్చిందని ఎస్‌ఈసీ ప్రకటించింది.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పథకాల పంపిణీల్లో పాల్గొనరాదని ఆదేశాలిచ్చింది. ఈ విషయంపై అన్ని జిల్లా కలెక్టర్లకు సమాచారం పంపాలని చీఫ్ సెక్రటరీకి కూడా నోట్ పంపింది.
త్వరలోనే చీఫ్ సెక్రటరీ, డీజీపీ, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఎన్నికల ఏర్పాట్లపై సమావేశం ఉంటుందని ఎస్‌ఈసీ తెలిపింది. కొవిడ్ నిబంధనల ప్రకారం ఎన్నికల సిబ్బంది, ఓటర్ల పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఎన్నికల సంఘం.. గత అనుభవాల దృష్ట్యా శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టిపెట్టామని చెప్పింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com