ఏపీలో ఉద్ధృతమవుతున్న విద్యుత్ ఉద్యోగుల ఆందోళన

ఏపీలో ఉద్ధృతమవుతున్న విద్యుత్ ఉద్యోగుల ఆందోళన

ఏపీలో.. విద్యుత్ ఉద్యోగుల ఆందోళన రోజురోజుకు ఉద్ధృతమవుతోంది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ...విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ ఇప్పటికే యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చింది. సమ్మె కార్యాచరణలో భాగంగా విజయవాడలోని రేపు విద్యుత్‌ సౌధ ఎదుట మహాధర్నాకు పిలుపునిచ్చారు జేఏసీ నేతలు. ఈ ‘మహాధర్నా’ను విఫలం చేసేందుకు జగన్ సర్కారు.... నిర్బంధ చర్యలకు దిగింది. ఉద్యోగులు విజయవాడ వెళ్లకుండా...కట్టడి చేస్తోంది. నిన్నటి నుంచే పలు జిల్లాల్లోని ఉద్యోగుల ఇళ్లకు వెళ్లిన పోలీసులు...... ఉద్యోగుల ఫొటోలు తీసుకున్నారు. మహాధర్నాకు వెళ్లడం లేదని అంగీకరిస్తూ హామీ పత్రంపై సంతకం చేయాలని ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. పోలీసులు వెళ్లిన సమయంలో ఇంట్లో లేని సిబ్బందికి ఫోన్లు చేసి సమాచారాన్ని సేకరించారు. వెంటనే స్టేషన్‌కు వచ్చి కలవాలని హుకుం జారీ చేస్తున్నారు. వివిధ జిల్లాల్లోని ఉద్యోగుల ఇళ్లకు వెళ్లి బైండోవర్‌ కేసులు పెడుతున్నారు. అందుబాటులో లేని ఉద్యోగులకు ఫోన్లు చేస్తూ.. స్టేషన్‌కు వచ్చి బైండోవర్‌ నోటీసు తీసుకోవాలని పోలీసులు ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. 12 జిల్లాలకు చెందిన సుమారు 40 మంది డివిజన్‌ స్థాయి నాయకులకు నోటీసులు ఇచ్చారని ఉద్యోగ సంఘాలు తెలిపాయి.

శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించకుండా ప్రశాంతంగా నిరసన తెలుపుతున్నా, తమకు పోలీసుల వేధింపులు తప్పడం లేదని మండిపడుతున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. పోలీసు స్టేషన్‌కు రావాలని హుకుం జారీ చేయడానికి ఉద్యోగులు ఏమైనా ముద్దాయిలా? అన్ని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఎన్‌జీవో సంఘాలు ఆందోళనకు పిలుపిచ్చిన సందర్భాల్లో ముందస్తు అరెస్టులు, బైండోవర్లతో నిరసన కార్యక్రమాలను ప్రభుత్వం అడ్డుకుంది. అదే తీరులో విద్యుత్‌ ఉద్యోగుల మహాధర్నాను భగ్నం చేసేందుకు ప్రభుత్వం రెండు రోజుల ముందు నుంచే చర్యలు ప్రారంభించింది మహాధర్నాకు ప్రభుత్వం అనుమతులు నిరాకరించడంతో అదే రోజు ‘వర్కు టు రూల్‌’ ద్వారా నిరసన తెలపాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, విద్యుత్‌ సంస్థల యాజమాన్యంతో ఇవాళ కూడా చర్చల్లో పాల్గొననున్నట్లు జేఏసీ తెలిపింది.

Tags

Next Story