AP Employees: ఏపీలో ఉద్యోగ సంఘాల ఉద్యమం తీవ్రం.. ప్రభుత్వ తీరుతో అసంతృప్తి..

AP Employees: ఏపీలో ఉద్యోగ సంఘాల ఉద్యమం తీవ్రం.. ప్రభుత్వ తీరుతో అసంతృప్తి..
AP Employees: ప్రభుత్వం తేల్చడం లేదు.. ఉద్యోగ సంఘాలు వెనక్కు తగ్గడం లేదు..

AP Employees: ప్రభుత్వం తేల్చడం లేదు.. ఉద్యోగ సంఘాలు వెనక్కు తగ్గడం లేదు.. దీంతో ఏపీలో సర్కార్‌ వర్సెస్‌ ఉద్యోగ సంఘాలుగా పరిస్థితి మారిపోయింది.. పీఆర్సీపై పెద్ద యుద్ధమే జరుగుతోంది.. తాజాగా కార్యదర్శుల సమావేశంలోనూ ఉద్యోగ సంఘాలకు చుక్కెదురైంది.. కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఉద్యోగులు ఫైరవుతున్నారు. ప్రభుత్వం ఏదో ఒకటి చెప్పే వరకు ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు.

ఏపీలో ఉద్యోగ సంఘాల ఉద్యమం మరింత తీవ్ర రూపం దాల్చే పరిస్థితులు కనబడుతున్నాయి.. ఇప్పటికే ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన ఏపీ జేఏసీ, ఏపీ ఎన్జీవో సంఘాలు ఇటు ప్రభుత్వంతో చర్చలు, సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాయి.. అయితే, చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు.. ముచ్చటగా మూడోసారి కూడా ఉద్యోగ సంఘాలకు సర్కారు నుంచి మొండిచేయే కనిపించింది..

పీఆర్సీ సహా సంబంధిత అంశాలపై జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లో భాగస్వాములైన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కార్యదర్శుల సమావేశం అమరావతిలో జరిగింది.. పీఆర్సీ నివేదిక ఇవ్వాలని కోరిన ఉద్యోగ సంఘాలు.. దీంతోపాటు 71 డిమాండ్లను మళ్లీ కార్యదర్శుల ముందుంచాయి.. అయితే, నివేదికలోని సాంకేతిక అంశాలపై అధ్యయనం చేయాలని అధికారులు వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పీఆర్సీ నివేదిక ఇవ్వలేమని స్పష్టం చేశారు. పీఆర్సీపై సీఎం జగన్‌ తిరుపతిలో ప్రకటన చేశారని.. సీఎం హామీ మేరకు పదిరోజుల్లో పీఆర్సీ ప్రకటన చేస్తామని కార్యదర్శుల కమిటీ తెలిపింది.

అయితే, కార్యదర్శుల వివరణపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి.. పీఆర్సీ నివేదిక ఇవ్వకుండా చర్చలెలా సాధ్యమని వారంతా ప్రశ్నించారు. దీంతో కార్యదర్శుల సమావేశం ఎటూ తేలకుండానే ముగిసింది. పీఆర్సీ నివేదిక ఇవ్వకపోవడం, సమస్యల పరిష్కారంపై ఎలాంటి స్పష్టత రాకపోవడంతో ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఉద్యోగుల్ని వైసీపీ ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టిందని ఆరోపించారు. కార్యదర్శుల కమిటీది కాలయాపన తప్ప కాదని విమర్శించారు.

అయితే, పీఆర్సీని మళ్లీ వాయిఆ వేస్తారా అనే అనుమానాన్ని ఉద్యోగ సంఘాల నేతలు వ్యక్తం చేస్తున్నారు.. ప్రభుత్వం ఏదో ఒకటి చెప్పే వరకు ఉద్యమ కార్యచరణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. మరోవైపు తిరుపతి పర్యటనలో సీఎం జగన్‌ పీఆర్సీ గురించి మాట్లాడినట్లు వచ్చిన వార్తలను ఏపీ ఎన్జీవో నేతలే తీవ్రంగా ఖండిస్తున్నారు. చిత్తూరు జిల్లాకు సంబంధించి ఏపీ ఎన్జీవోల తరపున, ఉద్యోగ సంఘాల తరపున అసలు ఎవరూ సీఎంను కలిసే ప్రయత్నం చేయడం లేదని నేతలు చెప్పుకొచ్చారు.

పీఆర్సీపై ప్రకటన చేయకుండా తప్పించుకుంటున్న ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమైన ఉద్యోగ సంఘాలను పక్కదారి పట్టించే ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి తప్పుడు సమాచారాన్ని బయట పెడుతున్నారని ఆరోపించారు. ఉద్యోగ సంఘాల ఐక్యతను దెబ్బతీయడం కోసం కూడా ఇలాంటి ప్రకటనలు చేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం చేశారు. మొత్తంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడకపోవడంతో ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి.. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేదిశగా అడుగులు వేస్తున్నాయి

Tags

Read MoreRead Less
Next Story