Ap Employees : నోటీసులను లెక్కచేయని ఉద్యోగులు.. చెప్పిన టైమ్‌కి, చెప్పిన చోటుకొచ్చి..!

Ap Employees : నోటీసులను లెక్కచేయని ఉద్యోగులు.. చెప్పిన టైమ్‌కి, చెప్పిన చోటుకొచ్చి..!
Ap Employees : ప్రభుత్వ ఉద్యోగులు ఉప్పెనలా దూసుకొచ్చారు. చెప్పిన టైమ్‌కి, చెప్పిన చోటుకొచ్చి నిలబడి గట్టిగానే తమ నిరసన తెలిపారు.

Ap Employees : ప్రభుత్వ ఉద్యోగులు ఉప్పెనలా దూసుకొచ్చారు. చెప్పిన టైమ్‌కి, చెప్పిన చోటుకొచ్చి నిలబడి గట్టిగానే తమ నిరసన తెలిపారు. నోటీసులను లెక్కచేయలేదు, ఏ ఆంక్షలు వారిని ఆపలేదు. చలో విజయవాడ అన్న ఒక్క పిలుపుతో పోలీసులను ఏమార్చి, దారులు మార్చి బీఆర్‌టీఎస్‌కు చేరుకున్నారు ఉద్యోగులు. రెండ్రోజుల నుంచి పోలీసుల ఆంక్షలు, నిర్బంధాలు చూసి.. ఉద్యోగులు బీఆర్‌టీఎస్‌కు రాగలరా అనుకున్నారు. కాని, ఎప్పుడొచ్చి కూర్చున్నారో, ఎలా వచ్చారో గాని.. పోటెత్తిన సంద్రంలా ఒక్కసారిగా దూసుకొచ్చారు.

పదులు, వందలు కాదు వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉప్పెనై ముంచెత్తారు. దీంతో చలో విజయవాడను భగ్నం చేద్దామనుకున్న ప్రభుత్వానికి సరైన రీతిలో సమాధానం చెప్పారు ఉద్యోగులు. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా.. చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేసి తీరతామని ముందు నుంచి ఉద్యోగ సంఘాల నేతలు, ఉపాధ్యాయ ఉద్యోగులు చెబుతూనే ఉన్నారు. చెప్పినట్టుగానే చలో విజయవాడను సక్సెస్‌ చేసి చూపించారు.

బీఆర్‌టీఎస్‌ నలువైపులా సీసీకెమెరాలు, బ్యారీకేడ్లు, పెద్ద ఎత్తున పోలీసు బలగాలు పెట్టినా.. అవేవీ ఉద్యోగులను నిలువరించలేకపోయాయి. జిల్లాల నుంచి ఉద్యోగులు రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకుని అదుపులోకి తీసుకున్నా.. మారువేషాల్లో వచ్చారు. అమ్మవారి గుడికి వెళ్తున్నామని, తాము రైతులమని, సామాన్యులమని చెప్పి వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు తరలి వచ్చారు. పీఆర్సీని వెనక్కి తీసుకోవాలన్న బ్యానర్లు, ఎర్రజెండాలతో బీఆర్‌టీఎస్ రోడ్డు కిక్కిరిసిపోయింది. అయినా 13 లక్షల ఉద్యోగులను ఎంత మంది పోలీసులు నిలువరించగలరని ప్రశ్నిస్తున్నారు ఉద్యోగులు. ప్రతి జిల్లా, ప్రతి మండలం, ప్రతి గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారని, వారందని ఎలా అడ్డుకోగలరని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story