Suspended : ఏపీ దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ శాంతిపై వేటు..!

దేవాదాయ శాఖలో పలు వివాదాలకు కారణమైన సహాయ కమిషనర్ కె.శాంతికి నిర్బంధ ఉద్యోగ విరమణ తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆమెపై ఉన్న ఆరోపణల నేపథ్యంలో దేవాదాయ శాఖ కమిషనర్ జారీ చేసిన తాఖీదుకు ఆమె ఇచ్చిన వివరణపై కమిషనర్ సంతృప్తి చెందలేదని సమాచారం. దీనితో ఆమెను నిర్బంధంగా ఉద్యోగ విరమణ చేయిస్తూ ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో శాంతి విశాఖపట్నం జిల్లా సహాయ కమిషనర్‌గా, విశాఖ, అనకాపల్లి, ఎన్టీఆర్ జిల్లాల దేవాదాయ శాఖ అధికారిగా పనిచేశారు. ఆ సమయంలో ఆమెపై నిబంధనల ఉల్లంఘన, దేవాదాయ ఆస్తులను పరిరక్షించకపోవడం, ఆలయాలకు నష్టం కలిగేలా వ్యవహరించారనే అభియోగాలు ఉన్నాయి.
వీటితో పాటు ఆమె తన మొదటి భర్త ఎం.మదన్‌మోహన్‌తో విడాకులు తీసుకోకుండానే పి.సుభాష్‌ను రెండో వివాహం చేసుకున్నారు. ఈ కారణాలతో గత ఏడాది ఆగస్టులో ఆమెను సస్పెండ్ చేసి, ఆ ఆరోపణలపై విచారణకు ఆదేశించారు. అయితే తనపై ఉన్న అభియోగాలకు ఆమె సరైన వివరణ ఇవ్వలేకపోయారు. దీంతో గత నెల 16న దేవాదాయ కమిషనర్ ఆమెకు తాఖీదు ఇచ్చి, నిర్బంధ ఉద్యోగ విరమణ ఎందుకు చేయకూడదో 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరారు.
ఇటీవల శాంతి తన వివరణను కమిషనర్‌కు పంపించారు. అందులో ఆమె పాతవాదననే పునరుద్ఘాటించారు. నిబంధనల ప్రకారమే వ్యవహరించానని, ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని పేర్కొన్నారు. మొదటి భర్తతో చాలా కాలంగా దూరంగా ఉంటున్నందునే రెండో వివాహం చేసుకున్నానని వివరణ ఇచ్చారు. అయితే ఈ వివరణపై దేవాదాయ కమిషనర్ సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. విడాకులు తీసుకోకుండా రెండో వివాహం చేసుకోవడం ఏపీ సివిల్ సర్వెంట్ రూల్ 25కి విరుద్ధమని దేవాదాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమెతో నిర్బంధ ఉద్యోగ విరమణ చేయిస్తూ కమిషనర్ ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు సమాచారం.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com