AP: ఏపీలో కొత్త జిల్లాలకు నేడే తుది నోటిఫికేషన్

ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న జిల్లాల పునర్ విభజనలో భాగంగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర మంత్రివర్గ భేటీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు లైన్ క్లియర్ చేసింది. ఈ సందర్భంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రివర్గ నిర్ణయంతో రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య 28కి పెరగనుంది. దీనికి సంబంధించి రేపు తుది గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. అన్నమయ్య జిల్లాలోని రాయచోటిని మదనపల్లె కొత్త జిల్లాకు, రాజంపేటను కడప జిల్లాకు, రైల్వే కోడూరును తిరుపతి జిల్లాకు, గూడూరును తిరుపతి జిల్లా నుంచి నెల్లూరులో కలిపే ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మరోవైపు కొత్తగా 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అన్నమయ్య జిల్లాను కొనసాగిస్తూనే.. జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మార్చే ప్రతిపాదనకు పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం ఈ జిల్లాలో ఉన్న రాజంపేట నియోజకవర్గాన్ని వైఎస్సార్ కడప జిల్లాలోకి, రైల్వేకోడూరును తిరుపతి జిల్లాలో కలపాలని నిర్ణయించింది. రాయచోటి నియోజకవర్గం అన్నమయ్య జిల్లాలోనే ఉంటుంది.
విస్తృతంగా చర్చించి అమోదం
జిల్లాల పునర్విభజనపై విస్తృతంగా చర్చించి అమోదం తెలిపింది. కొత్తగా 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతోపాటు.. కర్నూలు జిల్లా ఆదోని మండలాన్ని రెండుగా విభజించనున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ గ్రామం పేరును వాసవీ పెనుగొండగా మార్చనున్నారు. గూడూరు నియోజకవర్గంలోని మూడు మండలాల్ని శ్రీపొట్టి శ్రీరాములు జిల్లాలో కలిపారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి కందుకూరు, బాపట్ల జిల్లా నుంచి అద్దంకి నియోజకవర్గాలు ప్రకాశం జిల్లాలో కలవనున్నాయి. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలతోపాటు పలుచోట్ల మార్పులు, చేర్పులపై ఈ నెల 31న తుది నోటిఫికేషన్ జారీ కానుంది. జనవరి 1 నుంచి పాలన ప్రారంభం అవుతుంది. మొత్తంగా రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య ప్రస్తుతం ఉన్న 26 నుంచి 28కి పెరిగింది.
కొత్త రెవెన్యూ డివిజన్లు
1. అడ్డరోడ్డు జంక్షన్, అనకాపల్లి జిల్లా (7 మండలాలు)
2. అద్దంకి, ప్రకాశం జిల్లా (10 మండలాలు)
3. పీలేరు, అన్నమయ్య జిల్లా (8 మండలాలు)
4. మడకశిర, శ్రీసత్యసాయి జిల్లా (5 మండలాలు)
5. బనగానపల్లి, నంద్యాల జిల్లా (5 మండలాలు)
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

