AP Floods: కాస్త తగ్గుముఖం పట్టిన వర్షాలు.. కానీ మరో మూడు రోజుల్లో మరోసారి..

AP Floods (tv5news.in)

AP Floods (tv5news.in)

AP Floods: చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు తగ్గుముఖం పట్టాయి.

AP Floods: చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఇప్పటికీ పలు కాలనీలు జలదిగ్భంలోనే ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో కురిసిన వర్షాలకు నదుల్లో భారీగా వరద పోటెత్తుతోంది. సోమశిల నుంచి దిగువకు వస్తున్న వరదనీరు తగ్గుముఖం పట్టినా.. నదీ పరీవాహక ప్రాంతాలు ముంపులోనే ఉన్నాయి.

అనంతసాగరం నుంచి నెల్లూరు మీదుగా ఇందకూరు పేట మండలంలోని పల్లిపాడు వరకు అనేక గ్రామాలు నీట మునిగాయి. నేతాజీ నగర్‌లో ముంపు కారణంగగా 200 ఇండ్లు నాలుగు రోజులుగా వరద నీటిలోనే ఉన్నాయి. కర్నూలు జిల్లా మంత్రాలయంలో తుంగభద్ర నది ప్రమాదకర స్థాయిలో ఉదృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు తుంగభద్ర డ్యామ్‌కు భారీగా వరద నీరు చేరుతున్నందున, లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.

నదీపరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మంత్రాలయంలో దాదాపు లక్షా 20వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. గంగమ్మ దేవాలయం జలదిగ్భంధంలో చిక్కుకుంది. శ్రీరాఘవేంద్ర స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు నదిలో స్నానాలకు వెళ్లకుండా భారీకేడ్లను ఏర్పాటు చేసి, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

అనంతపురం జిల్లా హిందూపురంలోని కొట్నూరు చెరువుకు వరద పెరిగింది. ఈ వరద ప్రవాహంలో ప్రైవేటు బస్సుకు పెను ప్రమాదం తృటిలో తప్పింది. కాజ్‌వేను బస్సును దాటించే ప్రయత్నం డ్రైవర్‌ చేయగా.. నీటి ప్రవాహానికి అదుపు తప్పింది. దీంతో ప్రయాణికులు భయాందోళనకు లోనయ్యారు. బస్సు వరద గేట్లను తగిలి ఆగడంతో ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు బస్సు నుంచి సురక్షితంగా బయటపడ్డారు.

చిత్తూరు జిల్లా రాయల చెరువు వద్ద లీకేజీ అయిన ప్రాంతంలో వరద ప్రవాహం పెరిగింది. ఉదయం నుంచి నీటి ప్రవాహం ఎక్కువైంది. సహాయక చర్యలు ఆలస్యమవుతుండడంతో ఏ నిమిషమైనా రాయల చెరువు కట్ట తెగుతుందన్న ఆందోళన స్థానికుల్లో నెలకొంది. గండి పడిన రాయల చెరువు ప్రాంతాన్ని టీడీపీ బృందం సందర్శించింది. అక్కడ నత్తనడకన నడుస్తున్న సహాయక చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యంతోనే రాయల చెరువుకు గండిపడిందని టీడీపీ నేతలు ఆరోపించారు.

గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోడు మరింత ప్రమాదం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ అండమాన్ వద్ద మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఇది అల్పపీడనంగా మారి వాయువ్యదిశగా కదిలే అవకాశముందని పేర్కొంది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 26వ తేద నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నెల్లూరు, ప్రకాశం, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు మళ్లీ వానగండం పొంచి ఉంది.

Tags

Read MoreRead Less
Next Story