AP: "ఉగ్ర" కలకలం..వెలుగులోకి సంచలన విషయాలు

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో పట్టుబడ్డ ఉగ్రవాది నూర్ మహమ్మద్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నూర్ 37 వాట్సాప్ గ్రూపుల్లో సభ్యుడిగా ఉన్నట్లు తేలింది. నూర్ మహమ్మద్ ఫోన్లోని వాట్సాప్ గ్రూపుల్లో ఒసామా బిన్ లాడెన్, ఆల్ ఖైయిదా, లష్కరే తోయిబా, ఇండియన్ ముజాహిద్దీన్, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థలకు చెందిన వీడియోలను పోలీసులు గుర్తించారు. నూర్ మహ్మద్ ప్రస్తుతం కడప సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్నాడు. పోలీసులు అతడ్ని మరింత లోతుగా విచారించేందుకు నేడు కస్టడీ పిటిషన్ వేయనున్నారు. కాగా, నూర్ మహమ్మద్‌కు పాకిస్తాన్‌కు చెందిన జైషే మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థతో లింకులు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో గుర్తించింది. ముస్లిం యువతను అతడు ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
వంట మనిషిగా...
శ్రీసత్యసాయి జిల్లా చెందిన ఓ వంట మనిషికి పాకిస్థాన్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉండటం తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చిన సమాచారం ఆధారంగా ధర్మవరం పట్టణానికి చెందిన నూర్ మహ్మద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బయటకు సాధారణ జీవితం గడుపుతూ.. లోపల మాత్రం పాకిస్థాన్ ఉగ్రవాదులతో కలిసి పనిచేసిన వైనం తీవ్ర సంచలనం గా మారింది. ధర్మవరం పట్టణానికి చెందిన నూర్ మహ్మద్ లోనికోట ఏరియాలో నివసిస్తున్నారు. హోటల్లో వంట మనిషిగా... టీ చేసే వ్యక్తిగా సాధారణ జీవితం గడుపుతున్నారు. చాలీచాలని జీతంతో అప్పులు చేసిన ఇతను... కొంత కాలం క్రితం అజ్ఞాతంలోకి వెళ్లారు.
ఓ మహిళతో వివాహేతర సంబంధం..
నూర్.. సుమారు 30 ఉగ్రవాద సంస్థల్లో సభ్యుడిగా ఉన్నట్టు గుర్తించారు. నిందితుడి ఇంట్లో కొన్ని సిమ్ కార్డులు, ఉగ్రవాదాన్ని ప్రేరేపించే పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. నూర్ కుటుంబంలో తగాదాల కారణంగా భార్యను వదిలి వేరుగా ఉంటున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలోనే తాడిపత్రిలో ఓ మహిళతో ఇతనికి వివాహేతర సంబంధం ఉన్నట్టుగా గుర్తించిన పోలీసులు.. ఆమె గురించి విచారించారు. పాకిస్థాన్ తీవ్రవాద సంస్థలతో ఆ మహిళకు కూడా ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అన్న కోణంలో ప్రశ్నించారు. మార్కెట్ సమీపంలోని సల్మా బిర్యానీ హోటల్ చుట్టపక్కల కూడా నిందితుడికి సంబంధించిన కొంత సమాచారాన్ని పోలీసులు సేకరించారు. మరోవైపు ఇదే కేసులో యువకుడు రియాజ్‌ని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కీలక అంశాలను రాబట్టే పనిలో ఉన్నారు. అటు తమ కుమారుడు మంచి వాడని చెబుతున్నారు నూర్ మొహమ్మద్ తల్లితండ్రులు. పోలీసులు ఎందుకు తీసుకెళ్లారో తెలియదని అంటున్నారు. తమ ఇంట్లో నిర్వహించిన సోదాల్లో పోలీసులకు ఏమీ దొరకలేదని వివరించారు. నూర్ మహ్మద్ అరెస్ట్ తర్వాత తాడిపత్రికి చెందిన మహిళ అదృశ్యం అయ్యింది. ఆమెకు కూడా ఉగ్ర లింకులు ఉన్నాయా? ఆమె ద్వారానే నూర్ మహ్మద్‌కు ఉగ్రవాదులతో సంబంధాలు ఏర్పడ్డాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ధర్మవరం ఉగ్రవాది నూర్ మహ్మద్ ఇంట్లో జిహాద్ పుస్తకాలు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న వివరాలు వెల్లడించారు. అరెస్ట్ అయిన నూర్ మహ్మద్‌పై దేశ ద్రోహం, చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టాల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కదిరి కోర్టులో హాజరు పరిచారు. నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించింది కదిరి కోర్టు. ఎన్ఐఏ, కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో సహకారంతో పూర్తి స్థాయిలో ధర్మవరం పోలీసులు విచారణ చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com