AP: ఇక తెలుగులోనూ ప్రభుత్వ ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులను తెలుగులోనూ ఇవ్వాలని నిర్ణయించింది. ఇంగ్లీషులోనూ, తెలుగులోనూ జీఓ ఏం ఎస్ నెంబర్ 3ను సాధారణ పరిపాలన శాఖ జారీ చేసింది. ప్రభుత్వ పనితీరులో ఉత్తర్వులు కీలక పాత్ర పోషిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. 90 శాతం మంది తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్న రాష్ట్రంలో తెలుగులో ఉత్తర్వులు జారీ చేయడం సహేతుకమని ప్రభుత్వం పేర్కొంది. మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏపీలో తెలుగు భాషా సమగ్రతకు ఇలా ఉత్తర్వులు జారీ చేయడం తోడ్పడుతుందని పేర్కొంది.
అన్ని శాఖలకు ఉత్తర్వులు జారీ
ఆంగ్లం, తెలుగు రెండు భాషల్లోనూ ఉత్తర్వులు జారీ చేయాలని వివిధ శాఖలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మొదట ఆంగ్లంలో ఉత్తర్వులు జారీ చేసి రెండు రోజుల్లో తెలుగులో అప్లోడ్ చేయాలని లేదా మొదట తెలుగులో జారీ చేసి రెండు రోజుల్లో ఆంగ్లం లేదా రెండు భాషల్లో ఏక సమయంలో ఉత్తర్వులు ఇచ్చేలా వెసులుబాటు కల్పించింది. ఆంగ్లంతో పాటూ తెలుగులోనూ అదే ఉత్తర్వులు జారీ అయ్యేలా చర్యలు చేపట్టాలని వివిధ శాఖలకు సాధారణ పరిపాలన శాఖ సూచనలు ఇచ్చింది. ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో అనువదించడానికి డైరెక్టర్ ఆఫ్ ట్రాన్స్‌లేషన్ సేవలను వినియోగించుకోవాలని ఏపీ ప్రభుత్వం సూచించింది. ఈమేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
పుస్తక మహోత్సవాన్ని ప్రారంభించిన పవన్
విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో శుక్రవారం పుస్తక మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ పుస్తక మహోత్సవాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదగా ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ కొన్ని విలువైన పుస్తకాలను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుస్తక ప్రియులకు ఈ పుస్తక మహోత్సవం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. చాలా విలువైన పుస్తకాలను ఇక్కడ ప్రదర్శించడం నిజంగా గొప్ప కార్యక్రమమని ఆయన కొనియాడారు.
'మెగాస్టార్ లెజెండ్' పుస్తకంతో పవన్ కళ్యాణ్..
విజయవాడలో పుస్తక మహోత్స కార్యక్రమం గురువారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ వేడుకను ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలు స్టాల్స్‌లో ఉన్న పుస్తకాలను పరిశీలించారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రస్థానం గురించి ఉన్న “మెగాస్టార్ లెజెండ్ బుక్”ను ఆయన తీసుకున్నారు. సంబంధిత ఫొటోను మెగా అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ పుస్తకాన్ని యూ. వినాయకరావు రచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com