AP: తల్లికి వందనంపై స్పష్టత ఇచ్చిన సర్కార్

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి ప్రభుత్వం శుభవార్త వినిపించింది. తల్లికి వందనం నిబంధనలపై స్పష్టత ఇచ్చింది. తల్లికి వందనం పథకాన్ని మే నుంచి అమలు చేయనున్నట్లు... చంద్రబాబు శాసనసభ వేదికగా ప్రకటించారు. తల్లికి వందనం పథకం నిబంధనలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే వారందరికీ తల్లికి వందనం పథకం అమలు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇంట్లో బడికి వెళ్లే ఐదుగురు పిల్లలున్నా ప్రతి ఒక్కరికీ ఏడాదికి రూ. 15 వేలు తల్లి ఖాతాలో జమ చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.
జనాభా పెరగాల్సిందే
తానే కుటుంబ నియంత్రణ పాటించాలని గతంలో చెప్పానని చంద్రబాబు.. ప్రస్తుత అవసరాల దృష్ట్యా జనాభాను పెంచాలని తానే చెప్తున్నానని అన్నారు. మహిళా ఉద్యోగులకు ఎంత మంది పిల్లలకైనా ప్రసూతి సెలవులు ఇస్తామని చంద్రబాబు తెలిపారు. ఏపీ ప్రభుత్వం మహిళలను దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. మహిళా సాధికారతను మాటల్లో చెప్పడం కాదని.. చేతల్లో చేసి చూపించాలని సూచించారు. టీడీపీతోనే మహిళా సాధికారత ప్రారంభమైందని చెప్పారు. మహిళలకు ఆస్తిలో హక్కును తొలిసారి ఎన్టీఆర్ కల్పించారని గుర్తుచేశారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తే.. తల్లి, చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వలేదని జగన్ పై విమర్శలు గుప్పించారు. తమ ప్రభుత్వ హయాంలో తొలిసారి విద్యా, ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించామన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించామని... డీలిమిటేషన్ పూర్తయితే సుమారు 75 మంది మహిళలు అసెంబ్లీకి వస్తారని చంద్రబాబు తెలిపారు.
వాళ్లు చేసిన పాపమేంటి: చంద్రబాబు
అమరావతి మహిళలు చేసిన పాపం ఏంటని సీఎం చంద్రబాబు అసెంబ్లీ వేదికగా ప్రశ్నించారు. ‘వాళ్ల భూమి మీద కూర్చుని.. వాళ్లనే హింసించారు. రాజధాని కోసం భూములిచ్చినవాళ్లను వేధించారు. అయినా వెనకడుగు వేయకుండా గత ఐదేళ్లు అమరావతి మహిళలు వీరోచితంగా పోరాడారు. వాళ్ల పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది’. అని చంద్రబాబు వెల్లడించారు. : మగవాళ్ల కంటే ఆడవాళ్లే చాలా తెలివైన వారని ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభ వేదికగా ప్రకటించారు. అందుకే మహిళలను దృష్టిలో పెట్టుకునే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. ఆస్తిలో మహిళలకు సమాన వాటా ఇచ్చింది ఎన్టీఆరే అన్న చంద్రబాబు... ఇప్పుడు మహిళలకే ఎదురు కట్నం ఇచ్చే పరిస్థితులు ఉన్నాయన్నారు. మన సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com