AP: హామీల అమలు దిశగా చంద్రబాబు సర్కార్

ఆంధ్రప్రదేశ్ లో హామీల అమలు దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇప్పటికే కొన్ని హామీలను నెరవేర్చి దూకుడు మీదున్న చంద్రబాబు ప్రభుత్వం.. మరో మూడు కీలకమైన హామీలను అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. అత్యంత కీలకమైన మరో 3 పథకాలను రానున్న 4 నెలల్లో అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి తల్లికి వందనంతోపాటు డీఎస్సీ నియామకాలు పూర్తి చేయాలని చంద్రబాబు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం ఇస్తామని చంద్రబాబు ఇప్పటికే హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసి పాఠశాలలు తెరిచేలోగా ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. అలాగే రైతులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అన్నదాత సుఖీభవ పథకాన్ని సైతం అమలు చేయనున్నట్లు వివరించారు. ఖరీప్ సీజన్ పెట్టుబడులకు గానూ....మే నెలలోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేసే విధంగా అధికారులు కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.
సూపర్‌సిక్స్ అమలు
గతేడాది ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన సూపర్‌సిక్స్ హామీలు అమలు దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే చాలావరకు హామీలు అమలు చేయగా... కీలకమైన మరో మూడు హామీలను రానున్న నాలుగు నెలల్లో అమలు చేసే దిశగా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. విద్యార్థుల తల్లిదండ్రులు ఎదురుచూస్తున్న తల్లికి వందనం పథకాన్ని పాఠశాలలు పున: ప్రారంభించే జులై నాటికి అమలు చేయాలని...అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసంతకం చేసిన డీఎస్సీ నియామక ప్రక్రియ సైతం పూర్తి చేసే దిశగా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
విద్యుత్ ఛార్జీలపైనా...
విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు వీల్లేదని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ‘అవకాశం ఉంటే కరెంట్ ఛార్జీలను తగ్గించండి, అంతేకానీ పెంచేందుకు వీల్లేదు. అలానే సూర్యఘర్, పీఎం కుసుమ్ పథకాలు వేగంగా అమలయ్యేలా చర్యలు తీసుకవాలని, పాఠశాలలు తెరిచేనాటికి డీఎస్సీ పోస్టులు భర్తీ చేయాలని ఆదేశించారు.
మంత్రులకు ఆదేశాలు
ఫైల్స్‌ను వెంటనే క్లియర్ చేయాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రుల పనితీరు ఎలా ఉందో ఆయన వివరించారు. ఫైళ్ల క్లియరెన్స్‌లో మొదటి స్థానంలో మంత్రి నాస్యం మహమ్మద్ ఫరూఖ్ ఉండగా ఆఖరి స్థానంలో వాసంశెట్టి సుభాష్ నిలిచారని వెల్లడించారు. ఫైళ్ల క్లియరెన్స్‌లో తాను ఆరో స్థానంలో ఉన్నట్టు చంద్రబాబు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com