AP: బీసీ రక్షణ చట్టం అమలుకు కసరత్తు
ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం మరో హామీ అమలు దిశగా అడుగులేస్తోంది. బీసీ రక్షణ చట్టం రూపకల్పన ప్రక్రియపై కసరత్తు జరుగుతోంది. నేడు సెక్రటేరీయేట్‌లో బీసీ మంత్రులు భేటీ కానున్నారు. ఇవాళ మూడు గంటలకు 8 మంది బీసీ మంత్రులు భేటీ కానున్నారు. బీసీలకు మేలు కలిగేలా సీఎం చంద్రబాబు మరో నిర్ణయం తీసుకోనున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. బీసీ డిక్లరేషన్లో భాగంగా బీసీ రక్షణ చట్టం రూపకల్పనపై ఎనిమిది మంది బీసీ మంత్రుల సమావేశం జరగనుందని ఆమె తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం తరహాలో బీసీల రక్షణకు చట్టం చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని వెల్లడించారు. బీసీ డిక్లరేషన్ లోనూ మంత్రి నారా లోకేష్ కూడా హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడుతూ బీసీ రక్షణ చట్టం విధివిధానాల రూపకల్పనకు చంద్రబాబు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి సవిత స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా బీసీ భవనాలు
రాష్ట్రవ్యాప్తంగా బీసీ భవనాలను నిర్మించనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. అసంపూర్తిగా నిలిచిపోయిన బీసీ భవనాల నిర్మాణాలను తిరిగి చేపట్టనున్నట్లు తెలిపారు. అందులో భాగంగా శ్రీకాకుళం, చిత్తూరు, కర్నూలులో బీసీ భవనాల నిర్మాణానికి రూ.8 కోట్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. మిగతా జిల్లాలలోనూ స్థలాలను గుర్తించి బీసీ భవనాలను నిర్మించనున్నట్లు తెలిపారు. ఇక బీసీ స్టడీ సర్కిళ్ల బలోపేతానికి పది కోట్లు విడుదల చేస్తామని మంత్రి వెల్లడించారు. బీసీ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలపైనా నివేదికలు కోరినట్లు తెలిపారు.ఏపీలో వందమందితో ఐఏఎస్ స్టడీ సర్కి్ల్ ఏర్పాటు చేస్తామని మంత్రి సవిత వెల్లడించారు.
హామీల అమలు దిశగా
వైసీపీ పాలనలో ఏపీలో బీసీలకు రక్షణ కరువైందని అప్పట్లో విపక్షంగా ఉన్న టీడీపీ ఆరోపించింది. తాము అధికారంలోకి వస్తే బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తెస్తామని అప్పట్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఇదే విషయాన్ని పేర్కొన్నారు. బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం, బీసీల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయిస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. ఇక ఇచ్చిన హామీ మేరకు బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ రూపకల్పన చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దీంతో మరో హామీ అమలుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లైంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com