AP: ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

తిరుమల లడ్డూ వివాదం కొనసాగుతున్న వేళ ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ఆలయాల్లో ప్రొటోకాల్‌పై దృష్టి సారించిన ప్రభుత్వం నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఆలయాల్లో పట్టువస్త్రాల సమర్పణకు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ దేవదాయశాఖ మంత్రి లేదా సీనియర్ మంత్రి, ఇన్‌చార్జ్ మంత్రి మాత్రమే పట్టు వస్ర్తాలు సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఆలయాల్లో పండగల నిర్వహణకు అయ్యే ఖర్చును సీజీఎఫ్ నిధుల నుంచి వాడుకోవాలని సూచించింది. గత ప్రభుత్వ హయాంలో ఏపీ ఆలయాల్లో నిబంధనలను ఉల్లంఘించారని, రూల్స్ పాటించలేదనే ఆరోపణలు వచ్చాయి. ఆయా ఆలయాల్లో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే విషయంలోనూ ఇష్టానుసారంగా వ్యవహరించారని విమర్శలు వెల్లువెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
ఇష్టం లేకపోతే ఎందుకు వెళ్లడం..?
జగన్‌కు ఇష్టం లేకపోతే తిరుమలకు వెళ్లాల్సిన అవసరం లేదని... వెళ్లినప్పుడు నిబంధనల ప్రకారం అక్కడి సంప్రదాయాల్ని పాటించాల్సిందేనని చంద్రబాబు స్పష్టం చేశారు. డిక్లరేషన్‌పై సంతకం చేయకుండా దౌర్జన్యం చేస్తానంటే కుదరదన్నారు. వేంకటేశ్వరస్వామిపై భక్తి ఉన్నవారు ఎవరైనా ఆయన దర్శనానికి వెళ్లొచ్చని.... వేరే మతాలవారు స్వామి దర్శనానికి వెళ్లాలంటే కొన్ని సంప్రదాయాలు, పద్ధతులు ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. సంప్రదాయాల కంటే ఏ వ్యక్తీ గొప్పవాడు కాదని ముఖ్యమంత్రి అన్నారు. జగన్ తిరుమల దర్శనానికి వెళ్లాలంటే స్వామివారిపై తనకు విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇవ్వాలన్నారు. ఆయన్ను తిరుమల వెళ్లొద్దని ఎవరూ చెప్పలేదని.... ర్యాలీలు, జనసమీకరణలు చేయొద్దని చెప్పామని జగన్ తెలిపారు.
చట్టాన్ని జగన్ ఉల్లంఘించారు
చట్టాన్ని కాపాడే సీఎం హోదాలో ఉండి కూడా అప్పట్లో జగన్ దానిని ఉల్లంఘించారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ‘హిందువులు కాని వారు ఎవరైనా సరే డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే శ్రీవారిని దర్శించుకోవాలి. సీఎం హోదాలో వేంకటేశ్వరుడిని దర్శించుకున్నప్పుడు డిక్లరేషన్ ఇవ్వలేదని చెప్పడానికి జగన్‌కు సిగ్గుండాలి. దేవుడి దర్శనానికి వెళ్లే ఎవరైనా ఆచారాలు పాటించాల్సిందే’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com