AERO SPACE: ఏరోస్పేస్-డిఫెన్స్ పాలసీ ప్రకటించిన ఏపీ

ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 'ఏపీ ఏరోస్పేస్-డిఫెన్స్ పాలసీ-4.0'ను ప్రకటించింది. 2025 నుంచి 2030 మధ్య కాలానికి వర్తించే ఈ సరికొత్త విధానం ద్వారా రాష్ట్ర పారిశ్రామిక రంగానికి కొత్త ఊపునివ్వాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి ఎన్. యువరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కొత్త విధానం ద్వారా వచ్చే ఐదేళ్లలో రాష్ట్రానికి ఏకంగా రూ. లక్ష కోట్ల కొత్త పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించుకుంది. దీని ద్వారా సుమారు లక్ష మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు స్పష్టం చేసింది. ఏరోస్పేస్, రక్షణ రంగాల్లోకి చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSME), స్టార్టప్‌లతో పాటు భారీ సంస్థలను కూడా ప్రోత్సహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
మోడల్లో పార్కులు
పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఏరోస్పేస్, రక్షణ రంగ క్లస్టర్లను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ఇప్పటికే 23 వేల ఎకరాల భూమిని గుర్తించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. "హబ్ అండ్ స్పోక్" నమూనాలో ప్రత్యేకంగా ఎంఎస్ఎంఈ పార్కులను అభివృద్ధి చేయనున్నారు. ఏపీఐఐసీ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించి ఈ పార్కులను అభివృద్ధి చేస్తుంది.
ఏఐ హ్యాకథాన్ ఆరంభించిన సీఎం
శాంతిభద్రతలు సరిగా ఉన్నచోటే అభివృద్ధి జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గుంటూరులోని ఆర్వీఆర్ జేసీ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీసు ఏఐ హ్యాకథాన్‌ను సీఎం ప్రారంభించారు. ఐటీ కంపెనీలు, ఏఐ నిపుణులతో ముఖాముఖి అనంతరం ఆయన ప్రసంగించారు. " సీబీఎన్ ఉన్నంత వరకూ నేరస్థులకు చోటు లేదు. సాంకేతికతతో పాటు సంఘ విద్రోహశక్తులపై దృష్టి పెట్టాం. క్వాంటం వ్యాలీ కింద ఏఐకి ప్రాధాన్యం ఇచ్చాం. ఏఐ ద్వారా ప్రపంచ వ్యాప్తగా తెలుగువారి సత్తా చాటాలి. ఏఐ వస్తే ఉద్యోగాలు పోతాయనేది అపోహ మాత్రమే. ఆగస్టు 15 నుంచి వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ఇంటి నుంచే ధ్రువపత్రాలు పొందొచ్చు. ఎప్పటికప్పుడు టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. రాబోయే రోజుల్లో హార్డ్ వర్క్ కాదు.. స్మార్ట్ వర్క్ చేస్తే ప్రపంచాన్ని జయించే పరిస్థితి వస్తుంది. దేశంలో మొట్టమొదటి సారిగా డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ ఏర్పాటు చేయబోతున్నాం.” అని చంద్రబాబు వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com