AP: హామీల అమలు దిశగా కూటమి సర్కార్

ఎన్నికల వేళ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఒక్కొక్కటిగా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇప్పటికే అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలను కూడా వచ్చే నెలలోనే ప్రారంభించనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. జూన్ 12వ తేదీన అన్నదాత సుఖీభవ.. తల్లికి వందనం పథకం ప్రారంభించాలని ఇటీవల జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయించినట్లు.. భేటీ తర్వాత మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఎన్నికల హామీల్లో భాగంగా కూటమి ఇచ్చిన వాటిలో ఉచిత బస్సు హామీ కీలకమైనది. ఒక్కో హామీని అమలు చేసుకుంటూ వస్తున్న ప్రభుత్వం జూన్ లో అమ్మకు వందనం , అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేయాలని నిర్ణయించారు. ఆగస్టు పదిహేను నుంచి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉచిత బస్సును ప్రారంభిస్తారు. ఎన్నికల సమయంలో ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
కొత్త బస్సులు కొనుగోలు చేసి పథకం అమలు
తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తోంది. కర్ణాటకలో.. ఢిల్లీలోనూ అమల్లో ఉంది. అన్నిచోట్లా పథకం అమలును ఏపీ అధికారులు పరిశీలించారు. తెలంగాణలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోజునే.. ఉచిత బస్సును అమలు చేస్తున్నారు. అయితే హడావుడిగా ప్రకటించడం వల్ల నిర్వహణ పరమైన సమస్యలు వచ్చాయి. సరైన బస్సులు లేకపోవడం కూడా సమస్యగా మారింది. ఇలాంటి సమస్యలన్నింటినీ అధ్యయనం చేసిన ప్రభుత్వం వెయ్యి కొత్త బస్సుల్ని కొనుగోలు చేసి..కొత్త సిబ్బందిని నియమించుకుని పథకాన్ని అమలు చేయాలనుకుంటోంది. అందుకే ఆలస్యం అయినట్లుగా తెలుస్తోంది. ఈ పథకం అమలు అయితే.. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్లకు.. కూలీలకు ఎంతో కొంత ఆదాయ మిగులు ఉంటుందన్న అభిప్రాయం ఉంది. అందుకే పేద, మధ్యతరగతి ఆదాయవర్గాలు ఈ పథకం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.
ప్రపంచం గర్వించేలా యోగా డే:
ప్రపంచం గర్వించేలా విశాఖలో యోగా డే నిర్వహిస్తామని.. ప్రధాని మోదీ కూడా వస్తున్నారని చంద్రబాబు వెల్లడించారు. యోగా డేను నెలరోజులపాటు నిర్వహిస్తామన్న ముఖ్యమంత్రి... ప్రజలకు శిక్షణ ఇస్తామని... ప్రతి ఒక్కరూ రోజుకు అరగంట యోగా చేయాలని పిలుపునిచ్చారు. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో యోగా శిక్షణ ఇస్తామన్న చంద్రబాబు.. నెట్ జీరో వేస్ట్ కోసం ప్రజలంతా ఆలోచించాన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com