AP: ఏడు శ్వేత పత్రాల విడుదలకు ఏపీ సర్కార్ సిద్ధం

వైసీపీ ప్రభుత్వం కీలక రంగాల్ని ఎంతటి దారుణ పరిస్థితుల్లోకి నెట్టేసిందో ప్రజలకు తెలిపేందుకు వీలుగా మొత్తం ఏడు శ్వేతపత్రాలు విడుదల చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ నెల 28 నుంచి జులై 18 వరకూ రెండు, మూడు రోజులకొకటి చొప్పున ఈ శ్వేతపత్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విడుదల చేస్తారు. సామాజిక భద్రత పింఛను మొత్తాన్ని జులై నెల నుంచి రూ.4 వేలకు పెంచుతున్నామని ప్రభుత్వం తెలిపింది. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇంటివద్దకే ఈ మొత్తం అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో విడతల వారీగా రూ.2 వేల పింఛను రూ.3 వేలకు పెంచటానికి అయిదేళ్లు పట్టిందని... అధికారం చేపట్టిన 15 రోజుల్లోనే పింఛను మొత్తాన్ని ఒకేసారి రూ.వెయ్యి పెంచామని తెలిపింది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బకాయిల మొత్తం కలిపి జులైలో ఒక్కో పింఛనుదారుకు రూ.7 వేలు అందిస్తామని.... దివ్యాంగుల పింఛను రూ.6 వేలకు పెంచుతున్నామని ఏపీ సర్కార్ వివరించింది. మొత్తం 65.30 లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుందని, పింఛను మొత్తం పెంపు వల్ల ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా రూ.819 కోట్ల మేర భారం పడుతుందని వెల్లడించింది. ప్రస్తుతం చెల్లించాల్సిన బకాయిల భారం రూ.1,650 కోట్లు. వైసీపీ హయాంలో పింఛన్ల కోసం ఏడాదికి రూ.22,273.44 కోట్లు ఖర్చు కాగా.. మాకు 33,099.72 కోట్లు వ్యయమవుతోంది.
కీలక నిర్ణయాలు
ఎన్నికల్లో ఇచ్చిన ప్రధానమైన హామీల అమలు దిశగా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం మొదటి సమావేశంలోనే కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత చేసిన తొలి ఐదు సంతకాలకు సంబంధించిన అంశాలకు ఆమోద ముద్ర వేసింది. లక్షల మంది నిరుద్యోగుల ఎదురు చూపులు ఫలించేలా మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సమ్మతి తెలిపింది. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యంత దుర్మార్గపు చట్టమైన ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దు చేయాలని నిర్ణయించింది. 65.30 లక్షల మంది లబ్ధిదారులకు మేలు కలిగేలా సామాజిక భద్రత పింఛను మొత్తాన్ని రూ.4 వేలకు పెంచాలని తీర్మానించింది. విద్యార్థులు, యువతలో నైపుణ్య గణన చేపట్టాలని, తొలి దశలో 183 అన్న క్యాంటీన్లను ఒకేసారి ప్రారంభించాలని తీర్మానించింది. ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరించాలని నిర్ణయించింది. వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో వివిధ రంగాలు భ్రష్టుపట్టిన తీరుపై మొత్తం ఏడు శ్వేతపత్రాలు విడుదల చేయాలని తీర్మానించింది.
గంజాయి, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు వీలుగా అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళిక రూపొందిం చేందుకు ఐదుగురు మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో సోమవారం రాష్ట్ర మంత్రివర్గం తొలిసారి సమావేశమైంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ దాదాపు 4 గంటల పాటు సుదీర్ఘంగా ఈ భేటీ జరిగింది. అనంతరం సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మంత్రివర్గం నిర్ణయాలను విలేకరులకు వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com