AP: త్వరలోనే మెగా డీఎస్సీ

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల్లో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. ‘ఎన్నికల్లో ప్రజలు తమ ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఇచ్చారు. ప్రజల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వైసీపీ పాలనతో రాష్ట్రం ఎంతో నష్టపోయింది’. అని గవర్నర్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర కలను సాకారం చేస్తామని గవర్నర్ తెలిపారు. ఐటీ నుంచి ఏఐ రివల్యూషన్ దిశగా ఏపీ ప్రభుత్వం సాగుతుందని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం... రాష్ట్రాన్ని గాడిలో పెడుతోందని తెలిపారు. త్వరలో మెగా డీఎస్సీని నిర్వహించబోతున్నామని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టును పట్టాలెక్కించామని తెలిపారు.
యూనివర్శిటీలకు వీసీల నియామకం
‘పేద విద్యార్థులకు మెరుగైన విద్య వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం. అందుకే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నాం. మెరిట్ ఆధారంగా 9 యూనివర్శిటీలకు వీసీలను నియమించాం. అన్న క్యాంటీన్లు తెచ్చి పేదల ఆకలి తీరుస్తున్నాం. కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి’. అని గవర్నర్ వెల్లడించారు. 2029 నాటికి ప్రతి పేద కుటుంబానికి ఇళ్లు ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని గవర్నర్ తెలిపారు. ‘ప్రతి కుటుంబానికి సురక్షిత తాగునీరు, విద్యుత్ అందిస్తున్నాం. బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురానున్నాం. ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయనున్నాం. ఉద్యోగాలు, నైపుణ్య హబ్‌గా ఏపీని మార్చేందుకు ప్రయత్నిస్తున్నాం’. అని అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ వెల్లడించారు.
వైసీపీ పాలనపై గవర్నర్ విమర్శలు
వైసీపీ పాలనపై ఏపీ గవర్నర్ విమర్శలు చేశారు. గత ప్రభుత్వ పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని తెలిపారు. వైసీపీకి ప్రజలు ఓటుతో గుణపాఠం చెప్పారని విమర్శించారు. మళ్లీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాలనను గాడిలో పెడుతున్నట్లు వెల్లడించారు. అన్ని అంశాల్లోనూ గత వైసీపీ ప్రభుత్వం విఫలమైందని వెల్లడించారు. త్వరలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాలు విడుదల చేస్తాం అని గవర్నర్ తెలిపారు. ఆయన అసెంబ్లీ సమావేశాల్లో ప్రసంగిస్తున్నారు. ‘గత ప్రభుత్వ తీరుకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారు.. సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నాం. అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను రద్దు చేశాం. మోగా డీఎస్సీపై సంతకం చేశాం’. అని గవర్నర్ వెల్లడించారు.
గవర్నర్ స్పీచ్‌పై రోజా కీలక వ్యాఖ్యలు
గవర్నర్ ప్రసంగంపై మాజీ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర గవర్నర్‌తో సీఎం చంద్రబాబు అబద్ధాలు చెప్పించారని రోజా అన్నారు. లిక్కర్ రేట్లు పెంచారని, విద్యత్ చార్జీల రూపంలో రాష్ట్ర ప్రజలపై రూ.15 వేల కోట్ల భారం వేశారని ఆరోపించారు. జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఎందుకు భయమని ఆమె ప్రశ్నించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com